ఎపిలో 175 స్థానాల్లో పోటీ, తెలంగాణపై ఆగస్టులో వెల్లడిస్తా: పవన్ కల్యాణ్

ఎపిలో 175 స్థానాల్లో పోటీ, తెలంగాణపై ఆగస్టులో వెల్లడిస్తా: పవన్ కల్యాణ్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభా స్థానాలకు పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై ఆగస్టులో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన చేశారు. 

జనసేన వ్యూహకర్తగా దేవ్ ను నియమించినట్లు తెలిపారు. దేవ్ కు సిపిఎఫ్ కార్యకర్తలు సహకరిస్తారని చెప్పారు. పార్టీకి అనుభవం లేకపోయినా జనసేన ప్రతి కార్యకర్తకు కూడా రెండు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉందని ఆయన చెప్పారు. 

త్వరలో తాను ప్రజల మధ్యకు వస్తానని చెప్పారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర పర్యటన వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు.

మేడే సందర్భంగా పవన్ కల్యాణ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక జాతి నిర్మాణం, పురోగమనంలో కార్మికుల కఠోర శ్రమ, అంకిత భావం విస్మరించలేనివని ఆయన అన్నారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇచ్చి గౌరవించడం మన ధర్మమని అన్నారు. 

వారు తమకు న్యాయబద్దంగా దక్కాల్సిన హక్కుల కోసం, కనీస వేతనాల కోసం ఉద్యమించే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని అన్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page