ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాదిరిగా తాను కులాల మధ్య చిచ్చుపెట్టబోనని, సమన్యాయం చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌లా తాను మాట మార్చే వ్యక్తిని కూడా కాదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో జనసేన ఆధ్వర్వంలో పోరాట యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో పవన్ మాట్లాడారు. 

బీజేపీ నాలుగేళ్లుగా మహిళా బిల్లును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ఇచ్చేందుకు జనసేన కట్టుబడి ఉందని ప్రకటించారు. మీకు అనుకూలంగా ఉంటే మంచివారు, లేదంటే చెడ్డవారా అని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశనించారు. బాధ్యత కలిగినవాళ్లే రాజకీయాల్లో ఉండాలని, రాజకీయ పార్టీలు బాధ్యతలు విస్మరించాయి కాబట్టే తాను బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.

సినిమాలు తనకు వృత్తి, రాజకీయాలు బాధ్యత అని ఆయన అన్నారు. జనసేన ఏ పాటిదో మీ నాయకుడిని అడిగి తెలుసుకో అని ఆయన మంత్రి పితానిని ఉద్దేశించి అన్నారు. గత ఎన్నికల్లో జనసేన కారణంగానే టీడీపీ గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. బాధ్యత మరిచారు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని, దోపిడీలు చేస్తుంటే ప్రశ్నిస్తున్నామని, ప్రశ్నించేవారిని విమర్శిస్తే తాము సహించబోమని అన్నారు.
 
అంతకు ముందు భీమవరంలో చెత్త డంపింగ్ యార్డును జనసేనాని పరిశీలించారు. మురికి కుప్పల్లో తిరుగుతూ యార్డ్‌ను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు తరలివచ్చారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ముఖ్యమంత్రి కుమారుడు ఆరోగ్యంగా ఉంటే చాలా, మనందరికీ ఆరోగ్యం కావాలని ఆయన అన్నారు.