వాషింగ్టన్ డీసీ: నెల్సన్ మండేలకు ఎదురైన కష్టాలు తనకు లేవని, తనను ఎవరూ జైలులో పెట్టలేరని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఏర్పాటైన తానా సదస్సులో ఆయన ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి రావడానికి పురిగొల్పిన అంశాలపై ఆయన ఈ సదస్సులో సుదీర్ఘంగా మాట్లాడారు. 

చదువులో ఎప్పుడూ ఫెయిల్ అవుతుండేవాడినని, బట్టీ పట్టి చదివే పద్ధతి తనకు నచ్చలేదని, తనకు సృజనాత్మకమైన విద్య కావాలని, అందుకని తనకు తాను నేర్చుకున్నానని, సినిమాల్లోకి వచ్చినప్పుడు తనకు ఏమీ తెలియదని, రైటింగ్ స్కిల్స్, సినిమా టెక్నికల్ విషయాలు  నేర్చుకున్నానని ఆయన చెప్పారు. 

ఖుషీ సినిమా తర్వాత తనకు సినిమాలపై ఆసక్తి తగ్గిందని, ఈ సినిమా విజయోత్సవ సభలో తాను మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ చేయవద్దని భావించేవారు చేతులెత్తాలంటే ఒక్కరు కూడా ఎత్తలేదని, అందువల్ల సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేయలేవని తాను నమ్మానని, ప్రజల్లోకి వచ్చి ఏదో చేయాలని ఆ రోజే అనుకున్నానని ఆయన చెప్పారు. 

సినిమాలపై ఆసక్తి తగ్గి సమాజంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. సినిమాల్లో కూడా ఖుషీ తర్వాత అన్నీ వైఫల్యాలేనని, ఆ తర్వాత సక్సెస్ అయిన సినిమా గబ్బర్ సింగ్ అని, విజయం కోసం వేచి చూశానని, చాలా సహనంతో నిరీక్షించానని ఆయన చెప్పారు.   

బద్రీ సినిమా షూటింగు సమయంలో కేప్ టౌన్ లోని రాబిన్ ఐలాండ్ కనిపించిందని, అక్కడ నెల్సన్ మండేలా ఉండేవారని, మండేలా జీవితాన్ని చదువుకున్నానని, అదే తనకు ప్రేరణ ఇచ్చిందని, జాత్యహంకార పాలనను నెల్సన్ మండేలా ఆలోచన దెబ్బ కొట్టిందని ఆయన చెప్పారు. మండేలాలాంటి లాంటి కష్టాలు తనకు లేవని, తనను ఎవరూ జైలులో పెట్టలేరని, ఓటమిని తట్టుకుని శక్తి నెల్సన్ మండేలా నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు. 

ప్రాంతీయ విద్వేషాలు ఉండాలా, ప్రాంతాలుగా విడిపోవాలా, మతాలుగా విడిపోవాలా అనే ఆవేదన తనను ఆదేవనకు గురి చేస్తూ వచ్చిందని ఆయన అన్నారు.  కష్టాలు వచ్చినప్పుడు ఎవరూ రారని, మనమే ఐక్యంగా ఉండి గట్టెక్కాలని ఆయన అన్నారు. తనది చాలా చిన్న జీవితమని ఆయన అన్నారు. అందరూ మనుషులను విడదీస్తారని, తాను మనుషులను కలపడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. 

కులమూ మతమూ తనకు తెలియవని, తనకు ప్రాంతీయ విద్వేషాలు లేవని ఆయన చెప్పారు. తాను మనుషులను విడగొట్టి రాజకీయాలు చేయనని, మనుషులను కలిపే రాజకీయాలను చేస్తానని ఆయన చెప్పారు. భారతదేశాన్ని ప్రేమించేవాడిగా తాను విచ్ఛిన్నం చేయలేనని, అపజయమే తనను అలా నిలిపిందని ఆయన చెప్పారు.

రాజకీయ వ్యవస్థ మన జీవితాలను శాసిస్తోందని, తాను సంపూర్ణంగా ఓడిపోవచ్చు గానీ విలువలను నిలబెట్టినంత వరకు తాను గర్వంగానే నిలబడి మాట్లాడుతానని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియ చాలా కష్టంగా ఉందని, డబ్బులు లేకుండా రాజకీయం చేయడం కష్టమని తెలుసునని, తనను ఓడిస్తారని తనకు తెలుసునని, ఓడిపోతే నవ్వుతారా అంటే దేనికి గెలిచి తీరాలని ఆయన అన్నారు. విచ్ఛిన్నమవుతున్న సమాజంలో దాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత తనపై ఎన్ని వ్యాఖ్యలైనా రావచ్చునని, కానీ జైలుకెళ్లినవారికే ఇబ్బంది లేనప్పుడు తనకు ఎందుకు ఇబ్బంది ఉందడాలని ఆయన అడిగారు.