Asianet News TeluguAsianet News Telugu

నాకు ఈ ఆప్షన్ మాత్రమే వదిలిపెట్టారు.. హోటల్ గది కిటికీలో నుంచి పవన్ కల్యాణ్ అభివాదం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు విశాఖపట్నం పోలీసులు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోని ఈస్ట్ జోన్‌లో నిషేధాజ్ఞలు ఉన్న దృష్ట్యా ఎటువంటి ర్యాలీలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను బస చేస్తున్న హోటల్ గది కిటికీలో నుంచి పవన్.. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. 

Pawan Kalyan says greet followers from his hotel room window in visakhapatnam
Author
First Published Oct 16, 2022, 5:16 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు విశాఖపట్నం పోలీసులు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోని ఈస్ట్ జోన్‌లో నిషేధాజ్ఞలు ఉన్న దృష్ట్యా ఎటువంటి ర్యాలీలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని పవన్ కల్యాణ్ ‌సెటైర్లు వేశారు. తాను ప్రస్తుతం విశాఖలో బస చేస్తున్న నోవాటెల్ హోటల్‌లోని గది కిటికీ‌లో నుంచి అభిమానులకు అభివాదం చేశారు. హోటల్ ముందు తనకు మద్దతు తెలిపేందుకు పెద్ద తరలివచ్చిన జనసైనికులకు సంబంధించి వీడియోను కూడా పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. 

తన గది కిటికీలోంచి అభిమానులను పలకరించవద్దని ఏపీ పోలీసులు తనకు చెప్పరని ఆశిస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం జగన్‌ను థానోస్ అని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి శ్రీ థానోస్ గొప్ప నాయకత్వం కింద పనిచేస్తున్న ప్రియతమ ఏపీ పోలీసులు.. నన్ను జనసేన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. నా గది కిటికీలోంచి పలకరించేలా.. ఈ ఆప్షన్‌ను మాత్రమే నాకు వదిలిపెట్టారు’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 


పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నోవాటెల్ హోటల్‌ వద్దకు చేరుకుంటున్నారు. వారంతా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. 

ఇక, పవన్ కల్యాణ్ ఈ రోజు విశాఖపట్నం జనవాణి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే శనివారం సాయంత్రం నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దానిని వాయిదా వేశారు. పోలీసులు వెంటనే అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ బస చేస్తున్న హోటల్‌లోకి వెళ్లిన పోలీసులు.. ఆయనకు నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో శనివారం నాడు మంత్రులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల కాన్వాయ్‌లపై దాడికి పాల్పడిన ఘటనకు పవన్‌ కల్యాణ్‌ కారణమని నోటీసులో పేర్కొన్నారు.

అయితే ఈ నోటీసును మీడియాకు చూపించిన పవన్ కల్యాణ్..  ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. తాము విశాఖపట్నం రాకముందే దాడి జరిగిందని.. కానీ తాము రెచ్చగొట్టడం వల్లే ఆ ఘటన జరిగిందని నోటీసులు ఇచ్చారని చెప్పారు. నేరపూరిత రాజకీయాలపై పోరాటంలో కేసులు ఎదుర్కొనేందుకు , జైలుకు వెళ్లేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు.. అది సుదీర్ఘ పోరాటమని తనకు బాగా తెలుసునని అన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనకు సంబంధించి 28 మంది జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని.. వారిపై హత్యాయత్నం, ఇతర తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేశామని పవన్ చెప్పారు. పోలీసు నోటీసు తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నమని.. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దానితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు.

విశాఖపట్నం నగరంలోని ఈస్ట్ జోన్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి పోలీసు యాక్ట్ 30  అమలులో ఉందని.. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు అమలులో ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios