విశాఖపట్నం: తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం జనసేన కార్యకర్తల సమావేశంలో తన పోటీపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీచెయ్యాలి అనే అంశం తన చేతుల్లో లేదన్నారు.  

ఈ సందర్భంగా తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలనేది త్వరలోనే చెప్తానని స్పష్టం చేశారు. తాను ముక్కుమూసుకుని తపస్సు చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యాలని ప్రతిపాదనలు వస్తున్నాయని అయితే ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. 

ఈ సందర్భంలో పలువురు కార్యకర్తలు గాజువాక నుంచి పోటీ చెయ్యాలంటూ నినాదాలు చేశారు. భగవంతుడి ఆదేశిస్తే అక్కడ నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. తాను ఎంపీ కావాలనో, ఎమ్మెల్యే కావాలనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. 

ఏదైనా పదవి కావాలనుకుంటే తాను 2009లోనే విశాఖపట్నం నుంచో అనకాపల్లి నుంచో  ఎంపీగా పోటీచేసేవాడినని చెప్పుకొచ్చారు. బలమైన వ్యూహంతో రాజకీయాల్లోకి వచ్చానని కచ్చితంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెడుతుందన్నారు. 

తాను వ్యూహం రచించానంటే ఒక అడుగు ముందుకు వెయ్యడానికే తప్ప వెనకడుగు వెయ్యడానికి కాదన్నారు. కాబట్టి జనసేన కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జనసేనకు ఓటెయ్యాలని బలంగా చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.