విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వెనుకబాటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన జనస్వరం పేర ఆయన బుధవారం మేధావులు, నిపుణులతో చర్చలు జరిపారు. తన ఉత్తరాంధ్ర పర్యటనతో తన పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్రేకంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్రులను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన అన్నారు. వెనుకబాటు తనంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించే విధంగా ఉత్తరాంధ్ర సమస్యలున్నాయని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి తాను ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లినవారికి ఎకరం చొప్పున భూమి కొనిస్తానని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉంది గానీ నాయకుల్లో లేదని అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు చేస్తారని టీడీపి నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ విశాఖపట్నంలో టీడీపి నాయకులే ఎక్కువగా భూకబ్జాలు చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణకు వలస వెళ్లిన 26 కులాలవారిని స్థానికులుగా గుర్తించాలని తాను సిఎం కేసీఆర్ ను కోరుతానని చెప్పారు.