జగన్ జాబ్ క్యాలెండర్ పై సైటైరికల్ కార్టూన్ తో పవన్ కల్యాణ్ ట్వీట్..
ఏపీ ముఖ్యమంత్రి మీద జనసేన అధినేత వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన ఓ సెటైరికల్ కార్టూన్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
అమరావతి : ఛాన్స్ దొరికితే చాలు.. జగన్ మీద విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వేశారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదనే అంశం మీద ఓ కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘డిగ్రీ, పీజీ కూడా చేశాను. ఏదైనా జాబు ఇమ్మంటే… ఇది ఇచ్చి వెళ్లిపోయాడు’ అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలోని జాబ్ క్యాలెండర్ను చూపిస్తున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంది. పట్టభద్రుడు పకోడీలు, పండ్లు అమ్ముకుంటున్నట్లు ఉంది. ఆ పక్కనే సీఎం సెక్యూరిటీ తో వెళ్తున్నట్లు.. ఆయనను ఉద్దేశించి నిరుద్యోగి వ్యాఖ్యానించినట్లుగా చూపించారు. డిగ్రీ చేసి సామాన్లు మోస్తుంటే.. ఒకతను డిగ్రీ చేసి... ఇదేం పనయ్యా.. అని అడుగుతున్నట్టుగా కూడా ఉంది. దీంతో ఇప్పుడీ కార్టూన్ మీద దుమారం రేగుతోంది.
ఆ నలుగురిని రాజ్యసభకు పంపడం ముదావహం
‘పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ధి కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి? అని ఆలోచించే సమయం. ఇలాంటి కాలంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసేలా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది. ఈ నిర్ణయాన్ని నేను మనసారా స్వాగతిస్తున్నాం. పెద్దల సభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పి.టి.ఉష నియమితులయ్యారు.. అనే విషయం ఎంతో ఆనందాన్ని కలిగించింది’ అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.