నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వెంటనే 2.30 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటించండి: సీఎంకు చంద్రబాబు లేఖ
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏపీపీఎస్సీ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు 2.30 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, నిరుద్యోగులు మనోవేదనకు లోనవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. అలాగే, గ్రూప్ 1 ఉద్యోగాల అభ్యర్థుల ఎంపికలోనూ చాలా అవకతవకలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిదని పేర్కొన్నారు. నియమావళిని ఉల్లంఘించినట్టూ తెలిసిందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌ను కోరారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగ యువత ఎంతో శ్రమపడుతున్నదని, రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, వారి కలలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనుగడలో లేనట్టుందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం ప్రతి యేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిందని, కానీ, ఈ ప్రభుత్వ హామీ అమలు కోసం నిరుద్యోగ యువత మూడేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తల్లిదండ్రులపై ఆధారపడి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారని వివరించారు. కొందరు తమ తల్లిదండ్రులకు ఇంకా భారం కాలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలకు వారు గురవుతున్నారని తెలిపారు. వారి శ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన రీతిలో వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రిపేర్ అవుతూ ఉద్యోగ ప్రకటనలు రాక బలవన్మరణాలకు పాల్పడిన నిరుద్యోగ యువత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఈ విషయంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాల అభ్యర్థుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికకు గత మూడేళ్లుగా ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు అభ్యర్థుల్లో ఆందోళనలు పెంచుతున్నదని తెలిపారు. కొందరు గ్రూప్ 1 అభ్యర్థులను తనను ఆశ్రయించి వారి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు.
2018లో 165 గ్రూప్ 1 ఉద్యోగాలకు ప్రకటన వచ్చిందని, కాగా, 2019 డిసెంబర్‌లో పరీక్షలు జరిగాయని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో వివరించారు. 2021 మే నెలలో ఫలితాలు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే, గ్రూప్ 1 మయిన్స్ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అనేక అవకతవకలు జరిగాయని అభ్యర్థులు తనకు తెలిపారని వివరించారు. మెయిన్స్ పరీక్షల తేదీలను ఐదు సార్లు మార్చారని, పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా తప్పుల తడకగానే జరిగిందని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవడానికి కార్యదర్శి, కమిషన్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారని ఆయన తెలిపారు.
ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం, తొలి, రెండో మూల్యంకనాల ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాకనం అవసరం లేదని, కానీ, అంతమొత్తంలో తేడా లేకున్నా మూడో మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అస్మదీయుల కోసమే గ్రూప్ 1 మెయిన్స్‌లో అక్రమాలు చేశారని అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన సీఎం జగన్‌ను కోరారు.