అచ్యుతాపురం ప్రమాదంతో సర్కార్ హైఅలర్ట్ ... యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి పవన్ కల్యాణ్...
అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపనీ ప్రమాదంతో చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు.
Pawan Kalyan : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో చోటుచేసుకున్న ప్రమాదం చాలా ప్రాణాలను బలితీసుకుంది... ఎందరినో హాస్పిటల్ పాలు చేసింది. ఎసైన్షియా ఫార్మా కంపనీలో రియాక్టర్ పేలి మారణహోమం సృష్టించింది. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ఈ ప్రమాదంపై విచారణకు హైలెవెల్ కమిటీని ఏర్పాటుచేసిన చంద్రబాబు సర్కార్... నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఇలా ఫార్మా కంపనీ అగ్నిప్రమాదంపై విచారణ సాగుతుండగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపనీ యజమానులిద్దరూ హైదరాబాద్ లో వుంటారని... వారిమధ్య విబేధాల కారణంగా కంపనీని నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిసిందన్నారు పవన్. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
అచ్యుతాపురం ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని పరిశ్రమలన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం వుందని... ఇందుకు కంపనీల యాజమాన్యాలు సహకరించాలని పవన్ కోరారు. ప్రతి కంపనీ భద్రతా ప్రమాణాలను పాటించాలని డిప్యూటీ సీఎం సూచించారు.
పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని ముందునుండే తాను చెబుతున్నానని పవన్ గుర్తుచేసారు. ప్రజలతో పాటు కార్మికుల భద్రత పరిశ్రమల యాజమాన్యాల బాధ్యత... కాబట్టి సేఫ్టీ ఆడిట్ చాలా ముఖ్యమన్నారు డిప్యూటీ సీఎం. అయితే సేఫ్టీ ఆడిట్ అంటేనే పరిశ్రమల యజమానులు భయపడే పరిస్థితి వుంది... ఈ ఆడిట్ వల్ల తమ పరిశ్రమలు మూతపడతాయనే అనుమానం వారిలో వుందన్నారు. కాబట్టి సేఫ్టీ ఆడిట్ పై పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించాలి... వారే స్వయంగా భద్రతా చర్యలు తీసుకునేలా చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
అధికారంలో వున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయనే అపోహను ముందు తొలగించాల్సిన అవసరం వుందన్నారు. ప్రతి కంపనీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపడుతూనే లాభసాటిగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు.
పరిశ్రమల భద్రత కాదుగానీ కాలుష్య నియంత్రణ తన పరిధిలోకి వస్తుందని పవన్ తెలిపారు. కాలుష్య నివారణ తనిఖీలకు కంపనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ లో విశాఖపట్నంలో పర్యటించి... కాలుష్య నివారణ, సేఫ్టీ ఆడిట్ పై దృష్టి పెడతానని తెలిపారు. మూడు నెలల్లో దీనిపై కార్యాచరణను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు