అమరావతి: వామపక్షాలకు తానేమీ బాకీ లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లెఫ్ట్ పార్టీలకు నేనేమైనా బాకీ ఉన్నానా అని నిలదీశారు. బిజెపితో పొత్తు ఖరారు చేసుకున్న తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడానికి కన్నా ముందే తాను బిజెపితో కలిసి పని చేశానని ఆయన చెప్పారు. 

2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బిజెపి, తెలుగుదేశం కూటమి తరఫున ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన వేదికలను పంచుకున్నారు. చంద్రబాబును గెలిపించాలని కూడా ఆయన ప్రజలను కోరారు. 

Also Read: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బిజెపి, టీడీపీలకు దూరం జరిగి వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. వామపక్షాలు సైతం సున్నాతోనే సరిపెట్టుకున్నాయి. ఈ స్థితిలో ఆయన వామపక్షాలకు దూరం జరిగారు. 

ఇప్పుడు తాజాగా బిజెపితో పొత్తు ఖరారు చేసుకున్నారు. ఏపీకి బిజెపి అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. జనసేన, బిజెపి భావజాలాల్లో సారూప్యత ఉందని చెప్పారు. కేంద్రంలో బలమైన పార్టీ అధికారంలో ఉండాలని ఆయన అన్నారు. ఏపీ బాగు కోసం బిజెపితో కలిసి నడుస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. 

Also Read: బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

మోడీ, అమిత్ షా నమ్మకాలను నిలబెడుతామని ఆయన చెప్పారు. బిజెపితో గతంలో గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని తాను ఆ రోజే చెప్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.

టీడీపీ ఎవరు పొత్తు పెట్టుకున్నా విఫలం

టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా విఫలమవుతారని బిజెపి నేత సునీల్ ధియోధర్ అన్నారు. తమకు ఏపీలో ఎవరితోనూ రహస్య ఒప్పందాలు గానీ రహస్య స్నేహాలు గానీ లేవని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ తో పొత్తు ఖరారైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని, బంగారు ఆంధ్రప్రదేశ్ ను నిర్మిస్తామని ఆయన అన్నారు. వైసీపీ, టీడీపీలు తమకు సన్నిహితం కావని ఆయన అన్నారు. మంచి పాలనను అందించడంలో టీడీపీ, వైసిపీ విఫలమయ్యాయని ఆయన అన్నారు.