హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్..
కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్టుగా ప్రకటించిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఆదివారం అర్దరాత్రి బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు.

కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్టుగా ప్రకటించిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఆదివారం అర్దరాత్రి బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు. కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. అలాగే వైద్యులతో మాట్లాడి హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య 85 ఏళ్ల వయసులో అమరణ దీక్ష చేపట్టారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని కోరారు.
‘‘‘జనవరి 2 ( సోమవారం) ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తానని చెప్పాను. కానీ, పోలీసులు చేస్తున్న ఈ పనుల కారణంగా ఈ క్షణం నుంచే దీక్షను ప్రారంభిస్తున్నాను. నాకు ఏదైనా జరిగితే పోలీస్ అధికారులు, సీఎం జగన్‌లే కారణం’ అని హరిరామజోగయ్య ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలో వెనకబడిన కులాల వారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను హరిరామ జోగయ్య కోరుతున్నారు. రిజర్వేషన్ల అనేది తమ హక్కు అని అన్నారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం ప్రకారంగా.. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని డెడ్ లైన్ విధించారు. రిజర్వేషన్లను సంబంధించి ఉత్తర్వులు ఇవ్వకపోతే జనవరి 2వ తేదీ నుంచి తాను నిరవధిక నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఎటువంటి స్పందన లేదన్నారు. కాపులకు రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా సోమవారం నుంచి నిరవధిక నిరహార దీక్షకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. దీక్షకు సంబంధించిన ఆదివారం ఉదయంనుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఆయన ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రోడ్ల మీద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఆ తరువాత డీఎస్పీ మనోహరాచారి నేతృత్వంలో కాకినాడ, బందరు అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్, ఎన్ వీ రామాంజనేయులు.. హరిరామజోగయ్యతో దీక్ష విషయంలో మాట్లాడారు. అయితే, ఆయన దీక్ష విరమించుకోవడానికి ఒప్పుకోలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు. రిజర్వేషన్లపై జీవో విడుదల చేసేలా ప్రయత్నించాలని పోలీసులకి తెలిపారు. ఈ సమయంలో హరిరామజోగయ్య నివాసంలోకి మీడియాను అనుమతించలేదు. చర్చలు విఫలం కావడంతో ఆ తర్వాత 400 మంది పోలీసుల భద్రత మధ్య ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో హరిరామజోగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.