ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి  గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) భౌతికకాయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌ నివాళులర్పించారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) భౌతికకాయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్‌రెడ్డి చొరవ అభినందనీయం అన్నారు. రాష్ట్రాభివృద్దికి అహర్నిశలు పనిచేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అని చెప్పారు. గౌతమ్ రెడ్డి లాంటి వ్యక్తి హఠాన్మరణం.. రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. వ్యాపారంలో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు వెచ్చించారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా తన సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ వాయిదా వేసినట్టుగా చెప్పారు. 


ఇక, మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. గౌతమ్‌రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని అన్నారు. ఆయ‌న‌ మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల pawan kalyan సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ రోజు జరగాల్సిన భీమ్లానాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేశారు. ఈ మేరకు జనసేన తరఫున ఒక అధికారక ప్రకటన విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు. అందుకే నేడు జరగవలసిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం.. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణసంస్థ తెలియజేస్తుంది అటూ ప్రకటించారు

ఇక, గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక, ఈ రోజు సాయంత్రం వరకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.