కాకినాడ: ఇకపై తాను రెల్లి కులస్థుడినని గర్వంగా చెప్పుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెల్లి కులస్థులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
కాకినాడలో పారిశుధ్యకార్మికులతో పవన్  కళ్యాణ్ సమావేశమయ్యారు. రెల్లి ప్రజల సమస్యలు విన్నారు. పారిశూధ్యకార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేటికి కూడా రెల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. 

ఏ మతంలో ఏ కులంలో ఏ ప్రాంతంలో పుట్టాలో మన చేతుల్లో లేదని అంతా ఆ భగవంతుడి చేతుల్లో ఉందన్నారు. భగవంతుడు వరమిస్తే ఏం కోరుకుంటారో తెలియదు కానీ తాను రెల్లి సామాజికవర్గంలో పుట్టాలని కోరుకుంటానన్నారు. అందరూ మతాన్ని స్వీకరిస్తారు కానీ తాను మాత్రం కులాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 

పారిశూధ్య కార్మికులకు నేటికి ఇళ్లు అద్దెకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. చెత్తను ఎలా అయితే ఏరివేస్తారో రాజకీయాల్లో చెత్తను ఏరివేసేందుకు తాను జనసేన పార్టీ పెట్టానని తెలిపారు. భగవంతుడు మూడు రూపాల్లో ఉంటాడని సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడిలా, అన్నం పెట్టే రైతు రూపంలో,చెత్తను శుభ్రం చేసే పారిశూధ్య కార్మికుల రూపంలో ఉంటారన్నారు. 

మానవసేవే పరమావధిగా చెత్తను శుభ్రం చేసే మీ జీవితాల్లో వెలుగులు నింపకపోతే తాము పార్టీ పెట్టినా జాతికి ద్రోహం చేసిన వాళ్లమే అవుతామన్నారు. భవిష్యత్ లో రెల్లిల తలరాతలు మారుస్తానన్నారు. ఇల్లు అద్దెకు ఇస్తారా? అని మీరు అడిగే పరిస్థితి నుంచి వేరేవాళ్లు వచ్చి మిమ్మల్ని అద్దెకు అడగేలా మీ జీవితాలను మారుస్తాన్నారు.  

రెల్లి కులస్థులైనందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచే మీరు ఉన్నత కులస్థులని పవన్ అభిప్రాయపడ్డారు. అలా చేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలని అది రెల్లి కులస్థులకే ఉందన్నారు.  

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఎన్నికల ప్రచారంలో మాదిగ సామాజిక వర్గానికి తాను పెద్ద మాదిగను అవుతానంటూ హామీ ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ తాను రెల్లి కులస్థుడనంటూ వ్యాఖ్యలు చేశారు.