అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్ ఆశించే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలో అన్న అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు. 

కర్నూలు జిల్లా జనసేన పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్  పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల మధ్య కర్నూలు జిల్లా నలిగిపోతుందని ఆరోపించారు. యువత ఎదగాలనుకున్న పొలిటికల్ శక్తులు ఎదగనివ్వడం లేదని అభిప్రాయపడ్డారు.  

ఎన్నికలకు వెళ్తున్న స్ట్రాటజీని సైతం పవన్ కళ్యాణ్ క్లియర్ గా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 60శాతం కొత్తవారికి టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 20 శాతం భావజాలం ఉన్నవారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో 20 శాతం విలువలు ఉన్నవారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. 

అలాగే కొత్తవారికి ఎన్ని స్థానాలు కేటాయించాలో అన్న అంశంపై కూడా క్లారిటీ వచ్చిందని చెప్పారు. కొత్తవారిలో కసి ఉంటుంది కానీ వ్యూహం ఉండదని కుండబద్దలు కొట్టారు. అందరూ కొత్తవాళ్లే ఉంటే పార్టీ  నిలబడదని స్పష్టం చేశారు. అందువల్ల సీనియర్లు అవసరమని చెప్పుకొచ్చారు. 

2001 నుంచే తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. తాను 2003 నుంచే రాజకీయాలను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆనాడే తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 

మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించినట్లు పవన్ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం సంక్రాంతి లోపు తాత్కాలిక కమిటీలు వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి కమిటీలు వేసి నిత్యం ప్రజల మధ్య గడిపేందుకు వ్యూహరచన చేస్తానని తెలిపారు. 

రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పార్టీలపై ప్రజలు విసుగుతో మన వైపు చూస్తున్నారని తెలిపారు. మనం ఏదో చేస్తామని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని వారి ఆశలు నెరవేర్చేలా జనసేన ఉంటుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.