Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ ప్రకటనతో అలర్ట్: లీకు వీరులకు చంద్రబాబు క్లాస్

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు చాలా ముందుగానే ప్రకటించడం తమకు మేలు చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan makes Chandrababu to get alerted

అమరావతి: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు చాలా ముందుగానే ప్రకటించడం తమకు మేలు చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తమతో పెట్టుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తూ వచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ చాలా ముందుగానే తేల్చేయడం వల్ల అందుకు తగిన వ్యూహాన్ని రచించి, అమలు చేయడానికి తగిన సమయం చిక్కిందని తెలుగుదేశం వర్గాలంటున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుకుపోయిందంటూ పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ పై కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించారు. గత కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ ఆ విషయాలను తిరిగి ప్రస్తావించడం లేదు. అదో ఊరటగా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ చాలా ముందుగానే తన వైఖరిని వెల్లడించడంతో తిప్పికొట్టడానికి అవకాశం కూడా చిక్కిందని, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్, పవన్ కల్యాణ్ కలిసిపోయారని చెప్పడానికి వీలైందని అంటున్నారు. అంతేకాకుండా వారిద్దరిని బిజెపి నడిపిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలిగామని అంటున్నారు. 

ఇదిలావుంటే, లీకు వీరులతో చంద్రబాబుకు తిప్పలు వచ్చినట్లు చెబుతున్నారు. టీడీపి అంతర్గత సమావేశాల్లోని విషయాలు కూడా మీడియాకు చేరుతుండడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియాకు లీకులు ఇస్తోంది ఎవరనే విషయాన్ని గుర్తించినట్లుగా కూడా చెబుతున్నారు. వారికి తలుపులు మూసేసినట్లు సమాచారం.

టీడీపి గ్రాఫ్ పడిపోతోందని తెలుగుదేశం నాయకులు అంతర్గత సమావేశాల్లో అంటున్నట్లు చెబుతున్నారు. బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా అదే విషయం చెప్పారు. దాంతో చంద్రబాబు లీకు వీరులకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. టెలీ కాన్ఫరెన్స్ విషయాలను ప్రతిపక్ష నాయకులకు, మీడియాకు కొంత మంది చేరవస్తున్నట్లు ఆయన గుర్తించారని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios