Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి జీవో ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా?.. ఆ విషయంలో పోలీసులు వివరణ ఇవ్వాలి: పవన్ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. 

Pawan kalyan Letter to ys jagan over ban meetings on Roads
Author
First Published Jan 5, 2023, 9:33 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఓదార్పు యాత్ర పేరుతో సీఎం జగన్ దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్ షోలు చేయచ్చు కానీ... ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగడానికి కూడా అనుమతించకపోతే  ఎలా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలో లేనప్పుడు ఒక రూలు.. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా?  అని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. 

ఈ ఉత్తర్వులతో టీడీపీ చీఫ్ చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని.. ఈ విషయంలో  ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. సీఎం జగన్‌కు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయా? లేవా? అని ప్రశ్నించారు. రాజేమహేంద్రవరంలో జగన్ చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

జీవో 1లాంటివి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు... ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారని విమర్శించారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అని అన్నారు. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారని అన్నారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని తనకు నిర్బంధాలు విధించారని చెప్పారు. ఇప్పటం వెళ్లకుండా తనను అడ్డుకున్నారని అన్నారు. ఇప్పుడు ఆ విధానాలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారని విమర్శించారు. 

 


‘‘ఈ ఉత్తర్వులు బూచి చూపి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాను. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు జగన్ వర్తిస్తాయా? లేవా?. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకువస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి’’ అని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios