మండపేట: జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహం, క్రమశిక్షణ లేకపోవడం వల్లే గత ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడారు. రైతు సమస్యలపై చర్చించారు. రైతు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్న తరుణంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. విజిల్స్ తో మోత మోయించారు. కేకలు వేయోద్దని, అరవద్దని కోరడంతో కాసేపు శాంతించారు.

అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడును తింటున్నారంటూ ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని ఆరోపించారు. 

రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా

రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈనెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తన దీక్ష సమయంలో పరిస్థితులు ఎలా చేయిదాటతాయో చెప్పలేనని హెచ్చరించారు. 

రైతు కష్టం నుంచి మరింత కష్టాల్లోకి వెళ్తున్నాడని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చుపెడుతున్నారే కానీ రైతును ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. 

తాను తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నానని తెలియడంతో ప్రభుత్వం భయపడిందని చెప్పుకొచ్చారు. వాస్తవాలు చెప్తే విజిలెన్స్ దాడులు ఉంటాయని రైస్ మిల్లర్లను వైసీపీ నేతలు బెదిరించారని ఆరోపించారు. 

ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.80 కోట్లను ప్రభుత్వం అర్థరాత్రి విడుదల చేసిందని పవన్ ఆరోపించారు. రైతు సమస్యలపై ప్రసంగిస్తుండగా మళ్లీ జనసేన కార్యకర్తలు, అభిమానులు మరింత రెచ్చిపోయారు. అరుపులు కేకలతో అత్యుత్సాహం ప్రదర్శించారు.

అభిమానులు, కార్యకర్తల తీరుతో సహనం కోల్పోయిన పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు. జనసైనికులకు క్రమశిక్షణ లేకే ఓడిపోయానంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఇలా విజిల్స్, అరుపులు వేయడం వల్ల పార్టీకి తనకు ఇబ్బందిగా ఉందని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు పవన్ కళ్యాణ్.   

VIDEO: నేతలు రైతుల రక్తపు కూడు తింటూన్నారు: పవన్ కళ్యాణ్