పవన్ కల్యాణ్ కు టీడీపి ఎమ్మెల్యే లీగల్ నోటీసులు

First Published 23, May 2018, 10:11 PM IST
Pawan Kalyan issued legal notice for his allegations
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పలాస తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గౌతు శివాజీ లీగల్‌ నోటీసులు పంపారు.

శ్రీకాకుళం:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పలాస తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గౌతు శివాజీ లీగల్‌ నోటీసులు పంపారు. పలాసలో తాను అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణలను పవన్ కల్యాణ్  నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్‌ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలాస ఎమ్మెల్యే అవినీతికి పాల‍్పడుతున్నారని, పలాస ప్రజలకు అల్లుడు టాక్స్‌ పడుతోందని కాశీబుగ్గలో మంగళవారం జరిగిన సభలో పవన్‌ ఆరోపించారు. 
ఇటీవల జీఎస్టీ విన్నాం.. కాని పలాసలో మాత్రం అదనంగా అల్లుడు టాక్స్ కట్టాలట అని పవన్‌ అన్న మాటలపై శివాజీ మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని శివాజీ అన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేశారని అన్నారు.

ఇదిలావుంటే, కాశీబుగ్గలో మంగళవారం జరిగిన పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభా ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్దిచేశారు. పవన్‌ రాకతో సభా ప్రాంగణం అపవిత్రమైందని, అందుకే పసుపు నీళ్లతో శుద్దిచేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. 

loader