పవన్ కల్యాణ్ ను కదిలించిన మహిళా సర్పంచ్ ... ఎవరీ కారుమంచి సంయుక్త?
పవన్ కల్యాణ్ ... సినిమాలు, రాజకీయాల్లోనే కాదు పాలకుడిగాను పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అలాంటిది ఆయన ఓ మహిళా సర్పంచ్ ను కొనియాడటంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. .
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పంచాయితీలకు ఓకేసారి గ్రామసభలు నిర్వహించి రికార్డ్ సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామసభలో పాల్గొన్నారు. ఇలా తమ గ్రామానికి ఏం కావాలో నిర్ణయించుకునే బాధ్యతలు అక్కడి ప్రజలకే అప్పగించి స్థానిక పాలనకు సరికొత్త రూపాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ సభల్లో కోటి మంది పాల్గొని రూ.4500 కోట్లు విలువైన పనులకు ఆమోదం తెలిపారు.
అయితే రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరువారి పల్లె గ్రామసభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ కారుమంచి సంయుక్త ప్రారంభించి పంచాయతీ నిధులను, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ పంచాయతీలో రూ.38.46 లక్షలతో చేయాల్సిన 43 రకాల పనులు గురించి తీర్మానాలను చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మైసూరువారి పల్లె గ్రామసభలోనే ప్రత్యేకంగా ఎందుకు పాల్గొన్నారో తెలిపారు. గ్రామసర్పంచ్ సంయుక్త ధైర్యమే తనను కదిలించిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ దౌర్జన్యాలకు భయపడి చాలామంది పోటీచేయడానికి వెనకడుగు వేసారు... కానీ మైసూరువారి పల్లెలో ఓ ఆడబిడ్డ ధైర్యంగా ముందుకు వచ్చిందన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ఓ ఆర్మీ జవాన్ భార్యగా కారుమంచి సంయుక్త పోటీలో నిలవడమే కాదు గెలిచి చూపించారు. ఇది ఆమె తెగువకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ సహకారం లేకపోయినా తన గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలనే తపనతో సంయుక్త పనిచేసారని పవన్ తెలిపారు. ఆమె ఎన్నికల్లో చూపించిన తెగువ, గ్రామ అభివృద్ది కోసం చూపించే తాపత్రయమే తనను మైసూరువారి పల్లె వరకు తీసుకువచ్చాయని అన్నారు. ఈమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు వెళ్లాలని సూచించారు.
ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు... ఇలా ఆడపిల్లలంతా చదివితే దేశానికే వెలుగు అని అన్నారు. మారుమూల పంచాయతీ నుంచి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్ము ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఇలాగే అనేకమంది ఆడబిడ్డలు అనేక రంగాల్లొ గొప్పగొప్ప స్థానాల్లో వున్నారన్నారు. ప్రతి ఆడబిడ్డ దైర్యంగా ముందుకువచ్చి దేశ అభివృద్దిలో భాగం కావాలన్నారు పవన్ కల్యాణ్.
గ్రామ పంచాయతీల నుంచి బలమైన నాయకులు తయారవుతారు... ఇలా జాతీయ స్థాయికి ఎదిగిన నాయకులు అనేకమంది వున్నారని పవన్ పేర్కొన్నారు. అందుకే గ్రామాల్లో దేశభక్తి ఉప్పొంగాలనే ఉద్దేశంతో జాతీయ పండుగలను వైభవంగా జరిపేందుకు మేజర్, మైనర్ పంచాయతీలకు నిధులను భారీగా పెంచామని పవన్ గుర్తుచేసారు.
ఇక మైసూరువారి పల్లెలో ఉన్న కీలకమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడతామని పవన్ తెలిపారు. పాఠశాలకు ఆటస్థలం, కోల్డ్ స్టోరేజీ, అరటి పంటలకు బీమా అమలు, వాగుకు రక్షణ గోడ వంటివి తీరేలా చేస్తామన్నారు. పండ్లకు రాజధాని ఈ ప్రాంతాన్ని చేసి ఇక్కడకు పరిశ్రమలు వచ్చేలా చూస్తామన్నారు. స్థానిక యువతకు స్కిల్స్ శిక్షణ ఇచ్చి వారికి ఉన్నతంగా తయారు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
గ్రామ సర్పంచ్ కారుమంచి సంయుక్త చెప్పిన పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణ పంచాయతీల్లో భాగంగా గ్రామాలకు డిజిటల్ సేవలను తీసుకొస్తామన్నారు. కేంద్రం ఆగస్టు 15వ తేదీన దేశంలోని 2.7 లక్షల గ్రామాల్లో స్థానిక భాషలో సాఫ్ట్ వేర్ ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. దీన్ని ఉపయోగించుకొని ఆ పథకాన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తామన్నారు. ఇటీవల చేసిన పంచాయతీ డిక్లరేషన్ పకడ్భందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు