గాంధీజి కలను సాకారం చేసేందుకు ... పవన్ ముందడుగు : వల్లభనేని బాలశౌరి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఒకేరోజు వేలాది గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు. ఇకపై పవన్ కల్యాణ్ చేతిలోని శాఖ గ్రామ సర్సంచుల నిర్ణయం మేరకే నడుస్తుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించింది. స్వర్ణ గ్రామపంచాయితీ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు పునాది వేస్తోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.
ఒకేరోజు రాష్ట్రంలోని వేలాది పంచాయితీల్లో గ్రామసభలను సక్సెస్ ఫుల్ నిర్వహించడం ఓ చారిత్రాత్మక ఘట్టమని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు... తమ ఊరికి ఎలాంటి పనులు కావాలో నిర్ణయించుకునే అవకాశం ప్రజలకే దక్కడం గొప్ప విషయం అని బాలశౌరి పేర్కొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి ఉపాధి హామీ పనులు ఉపయోగపడేలా చర్చ జరిగి మంచి నిర్ణయాలు వెలువడ్డాయని అన్నారు. ఇకనుండి పంచాయత్ రాజ్ వ్యవస్థ గ్రామ సభల తీర్మానాల మేరకు పనిచేయనుందంటూ బాలశౌరి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
ఏపీ పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టిన నాటి నుండి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని బాలశౌరి పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి సామాజిక వనాలను పెంచాలన్న గొప్ప నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసారు. ఇలా ఆదాయం సమకూర్చుకొని పంచాయతీలు ఆర్ధికంగా స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించడం మంచి పరిణామంగా బాలశౌరి తెలిపారు.
గ్రామ సర్పంచుల అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని తమ గ్రామాల అభివృద్ధిపై చర్చించారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన అంశాల అనగా ఇళ్ళకు విద్యుత్, కుళాయి, వంట గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘన వ్యర్ధాల నిర్వహణ, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామల నుండి మండల కేంద్రాలకు లింకు రోడ్లు, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు, పంట కుంటల నిర్మాణo, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం మొదలైన విషయాలపై చర్చ జరిపి నిర్ణయాలు తీసుకున్నారని బాలశౌరి తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం తో సెప్టెంబర్ నుండి వచ్చే మార్చి మధ్య ఏడు నెలల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో జాబ్ కార్డు కలిగిఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజులపాటు పని కల్పించడంతో పాటు మెటీరియల్ నిధులు సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఉపాధి హామీపధకంపై ప్రజలకు అవగాహన కల్పించి నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యెక చొరవ తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.