రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదివరకే రైలు యాత్ర చేపట్టిన పవన్ సామాన్యుల సమస్యలు తెలుసుకునేందుకు సామాన్యుడు ప్రయాణించే బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు.  ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రంపచోడవరంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్వాసితలు సమస్యలు తెలుసుకునేందుకు బయలు దేరారు. 

గతంలో మాదిరి కాన్వాయ్ తో వెళ్లలేదు. ఒక సామాన్యుడు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులో పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వెళ్లారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏజెన్సీలో ప్రజల జీవన స్థితిగతులపై పవన్ ఆరా తీశారు. 

రాజమహేంద్రవరం నుంచి మధ్యాహ్నాం బయలు దేరిన  పవన్ కళ్యాణ్  గుడాల, కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్‌ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జనసేన నేత,నాదండ్ల మనోహర్, మాజీ మంత్రి బాలరాజు ఉన్నారు.