Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలంటే బుగ్గలు నిమరడం, తల నిమరడం కాదు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

దేశానికి పట్టెడన్నం పెడుతున్న అన్నదాతే తనకు దేవుడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్నికాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప పదవుల కోసం కాదని పవన్ స్పష్టం చేశారు. 

pawan kalyan fires on ys jagan, chandrababu
Author
Mandapeta, First Published Nov 23, 2018, 9:37 PM IST

మండపేట: దేశానికి పట్టెడన్నం పెడుతున్న అన్నదాతే తనకు దేవుడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్నికాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప పదవుల కోసం కాదని పవన్ స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతీ రాజకీయ పార్టీ అన్యాయం చేసిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఘోరంగా మోసం చేశాయన్నారు. అలాంటి రాష్ట్రాన్ని పట్టించుకున్న ఏకైక  పార్టీ జనసేన పార్టీమాత్రమేనని తెలిపారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై గళమెత్తిన మెుట్టమెుదటి పార్టీ జనసేన అన్నారు. దేశంలో అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీ జనసేన అని చెప్పారు. జనసేన పార్టీ ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. 

జనసేన పార్టీ సామాన్యుల నుంచి పుట్టిందని అవినీతి నుంచి పుట్టిన పార్టీ కాదన్నారు. జనసేన పార్టీ కుళ్లు రాజకీయ వ్యవస్థపై ఎక్కడికైనా వెళ్లి పోరాడతానన్నారు. చెన్నై, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ల నుంచైనా పోరాటం చేస్తానని ఎప్పుడూ వెనకడుగు వెయ్యనన్నారు. 

సమ్మెట దెబ్బకు రాటు దేలుతానే తప్ప బెదిరిపోనని ప్రతీ దెబ్బదెబ్బకు రాటు దేలి అవినీతిని కండకండలుగా నరికేస్తానన్నారు. రాజకీయాల్లో కుళ్లును కడిగేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గోదావరి జిల్లాలో ఖనిజ, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నా ఉద్యోగాలు మాత్రం లేవన్నారు. 

ఇసుక మాఫియా చేసే ప్రతి ఎమ్మెల్యే టపాకాయల్లా పేలిపోతారని పవన్ హెచ్చరించారు. భావితరాలకు తగినట్టుగా రాజకీయం మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ పై పవన్ విరుచుకుపడ్డారు. జగన్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. జగన్‌ మాదిరిగా తాను పారిపోనన్నారు.

జగన్ దగ్గర వేల కోట్లు ఉన్నాయని అన్నారు. రాజకీయాలంటే బుగ్గలు నిమరడం, తల నిమరడం కాదంటూ పవన్ ధ్వజమెత్తారు. ఒక ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిందేనా అంటూ మండిపడ్డారు. సామాన్యుడు ఎమ్మెల్యే కాకూడదా అని నిలదీశారు.

 తెలంగాణలో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన వ్యక్తులపై తాను పోరాటం చేశానని కానీ జగన్ కనీసం అలా చూడలేదన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కాలేడన్నారు. 

సామాన్యుడు ఎందుకు ఎమ్మెల్యే కాకూడదో అని తనకు తానుగానే ప్రశ్నించుకున్నానని తాను ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. అవినీతితో కూడుకుపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

జనసేన అధికారంలోకి వచ్చిన రోజున అవినీతి ఎమ్మెల్యేల భరతం పడతామని చెప్పారు. ఆడపడుచుల కోసం మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌, చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్నికాపాడలేరని, వారిద్దరూ అవినీతి రహిత పాలనను అందించలేరని విమర్శించారు. తాను అవినీతి రహిత పాలనను అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. 

మరోవైపు తాను పార్టీని ఇతర పార్టీలో విలీనం చెయ్యనని ఇతర పార్టీలతో కలిసి పనిచెయ్యనని పవన్ స్పష్టం చేశారు. చావు అయినా చస్తాను కానీ పోరాటం మాత్రం ఆపనన్నారు. కుళ్లుపోయిన సమాజాన్ని మార్చేందుకు అవినీతిని ప్రశ్నించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

వ్యాపారులే రాజకీయ నాయకులైతే, దేశభక్తి లేని వ్యక్తులు రాజకీయాలు ఏలితే దేశంలో అవినీతిని పెరిగిపోవడం తప్ప ప్రజా సంక్షేమం ఉండదని నీతి వంతమైన పాలన అందదని చెప్పుకొచ్చారు. ప్రజలకు నీతివంతమైన అవినీతి రహిత పాలన అందాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావాలని పదేపదే ప్రజలను కోరుతున్నారని వస్తే రాష్ట్రం ఏమవుతుందో ప్రజలకు తెలుసనన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే చెరువులో మట్టి ఉండదని మట్టిని తినేస్తారని, గోదావరి తీరాల్లో ఉన్న ఇసుకను మింగేస్తారని ధ్వజమెత్తారు. పంచభూతాలను సైతం ధనరూపంలో మింగేస్తారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేలపై పట్టుకోల్పోయారని ఆయన ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు అంత అవినీతి చేస్తుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని పెద్దవారై పోయారన్నారు. ఆయన ఏదో అలా నడుస్తున్నారని తెలిపారు. 

వయసు అయిపోయినందు వల్లే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ను దొడ్డిదారిన రాజకీయాల్లోకి తీసుకువచ్చారన్నారు. గ్రామపంచాయితీలో సర్పంచ్ గా కూడా పోటీ చెయ్యలేని వ్యక్తిని మంత్రిని చేసేశారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఆ విషయాన్ని తెలుసుకోవాలని లోకేష్ కు తెలిపారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ లు ముఖ్యమంత్రి అవుతారు కానీ ఒక కాని స్టేబుల్ కొడుకు సీఎం కాలేడా అని పవన్ ప్రశ్నించాడు. చంద్రబాబు పాలనలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు చింతకాయల్లా రాలిపోతారని, దీపావళి పండుగలో టపాసుల్లా పేలిపోతారని తిట్టిపోశారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని పాలన రౌడీయిజం, దౌర్జన్యాలతో నిండిపోయిందన్నారు. 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుషులు తన దగ్గరకు వచ్చి సినిమా చెయ్యాలని బెదిరించారని అయినా తాను భయపడలేదన్నారు. సినిమా చేసేది లేదని గట్టిగా సమాధానం చేసిచెప్పి తిప్పి పంపించేశానన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios