నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలు అంటేనే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలు అని పేరు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది తేల్చే జిల్లాలు ఇవే. మెుత్తం 34 నియోజకవర్గాలలో ఏ పార్టీ అత్యధిక నియోజకవర్గాలు గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఆది నుంచి వస్తున్న సెంటిమెంట్. 

ఇలాంటి సెంటిమెంట్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని వెంటాడుతోందని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లా మెగల్తూరు. దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి క్రేజ్ ఉన్నప్పటికీ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో అది కాస్త మరింత ఎక్కువనే చెప్పాలి. 

చిరంజీవి కుటుంబాన్ని తమకుటుంబంగా భావించే వీరాభిమానులు ఉభయగోదావరి జిల్లాలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో అందులోనూ సొంత జిల్లా ప్రజలు అభిమానం చూపిస్తున్నారే కానీ ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో వెయ్యడం లేదన్నది నగ్న సత్యం. 

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తన సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పాలకొల్లుతోపాటు చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి కూడా పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి విజయం సాధిస్తారని అంతా ఊహించారు. 

తిరుపతి ఎలా ఉన్నా పాలకొల్లులో మాత్రం చిరంజీవి గెలుపు నల్లేరుపై నడకేనని ప్రచారం జరిగింది. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి సీన్ కాస్త రివర్స్ అయ్యింది. ఫలితాలు అటు ఇటు అయ్యాయి. సొంత జిల్లా ప్రజలు చిరంజీవిని ఆదరించలేదు. కానీ పొరుగు జిల్లా ప్రజలు మాత్రం ఆదరించారు. 

ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి అన్న చందంగా అన్నయ్య బాటలోనే పయనిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. 

పవన్ కళ్యాణ్ తన రాజకీయభవిష్యత్ కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. 

భీమవరంతో పాటు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అన్నయ్య అనుసరించిన బాటనే పవన్ కళ్యాణ్ అనుసరించారు. అయితే భీమవరంలో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. 

2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గ్రంథి శ్రీనివాస్ ఈసారి గెలుపు పై గట్టి ధీమాతో ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి అండగా ఉండటమే కాకుండా స్థానిక సమస్యల పరిష్కారంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోయారు. 

స్థానిక ఎమ్మెల్యే కంటే ఆయన ముందుండి పనులు చేశారని ప్రచారం ఉంది. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి తన గెలుపుకు మార్గాలను సుముగం చేసుకున్నారు. అయితే అనూహ్య రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తుండటంతో ఆయన తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. 

గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో సామధానబేధ దండోపాయలను అస్త్రాలుగా ప్రయోగించారని ప్రచారం. ఇకపోతే ఎన్నికల అనంతరం వెలువడిన సర్వేలు సైతం భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనంటూ చెప్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ను కూడా అన్న సెంటిమెంట్ వెంటాడుతోందా అంటూ ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు గాజువాకలో మాత్రం పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తారంటూ సర్వేలు చెప్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తే పవన్ కళ్యాణ్ ను కూడా సొంత జిల్లా వాసులు ఆదరించలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 

మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు సైతం పశ్చిమగోదావరి జిల్లా నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుంచి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

మెగాబ్రదర్ నాగబాబు సైతం టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారని టాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుకు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే నాగబాబుకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని లేని పక్షంలో ఆయన గెలుపు కూడా కష్టమేనంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

మరోవైపు భీమవరంలో పవన కళ్యాణ్, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబు కచ్చితంగా గెలుస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి అన్నదమ్ములిద్దరూ గెలిస్తే సరికొత్త రికార్డు సృష్టించినట్లేనని టాక్. 

పశ్చిమగోదావరి జిల్లాలో గెలిచిన నాయకులు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటారని ఒక నానుడి ఉంది. పవన్ కళ్యాణ్, నాగబాబు గెలిస్తే ఆ నానుడిని నిజం చేస్తారంటూ స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

మెుత్తానికి పశ్చిమగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్, నాగబాబుల రాజకీయ భవిష్యత్ కు బాటలు వేస్తుందా లేక బీటలు తీస్తుందా లేకపోతే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిలాగా తమ్ముళ్లను కూడా సెంటిమెంట్ వెంటాడుతోందా అన్నది తేలాల్సి ఉంది. మరి ఓటర్ దేవుళ్లు తమ అభిమాన హీరోలకు ఎలాంటి తీర్పునిచ్చారో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.