పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘‘సత్యాగ్రహి’’ అనే సినిమా వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఆ సినిమా ఉంటుందన్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ‘‘సత్యాగ్రహి’’ కనిపించకుండా పోయింది. ఇందుకు గల కారణాలను స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ప్రవాస గర్జన పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలోని ప్రవాసులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా డల్లాస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను పార్టీ ఫండ్ కోసం అమెరికా రాలేదని.. ఆత్మగౌరవంతో బతికేవాడినని, డబ్బును వదులుకున్న వాడినన్నారు.

ఇప్పటికీ తాను సినిమా చేస్తే ఎవరూ ఊహించనంత డబ్బు ఇస్తారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ దేశంలో జెండా ఎగురవేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను సత్యాగ్రహి అనే సినిమా చేయాల్సి ఉందని .. కానీ దానిని నిజజీవితంలో చేసి చూపించాలని భావించి ఆ సినిమాను ఆపేశానని స్పష్టం చేశారు.

అన్ని పార్టీలకు కులాల వారీగా ఎస్సీ వింగ్, బీసీ వింగ్ అని విభాగాలుంటాయని... కానీ అలా కులాల వారీగా, మతాల వారీగా విడదీయడం జనసేన ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో శ్రీలత అనే వైద్యురాలి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

‘‘తనది అనంతపురం జిల్లా అని తెల్లకోటు వేసుకుంటే తామంతా డాక్టర్లమని.. అదే తీసేస్తే మేము పవన్ కల్యాణ్ అభిమానులం అన్నారు. ‘‘మన జనసేనాని వచ్చేశారు.. ఇప్పుడు కూడా సమాజసేవ చేయ్యకపోతే.. ఇంకెప్పుడూ చేయలేనని ఆమె అన్నారు. తనకు ముగ్గురు పిల్లలని.. తన భర్త చాలా మంచివారని.. పిల్లల్ని నేను చూసుకుంటాను.. ఇక నువ్వు వెళ్లు అన్నారు... వచ్చేశాను అంటూ శ్రీలత జనసేన కార్యకర్తల్లో స్పూర్తి నింపారు.