చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఆయనకు మా మద్దతు ఉంటుంది: పవన్ కల్యాణ్ (వీడియో)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏ తప్పు చేయని ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి వేధిస్తున్నారని అన్నారు. గతంలో విశాఖపట్నంలో జనసేన నాయకుల విషయంలో ఇలాగే వ్యవహరించారని పవన్ గుర్తుచేశారు.
‘‘ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్దరాత్రి అరెస్ట్ చేసే విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో జనసేన పట్ల పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని జనసేన నాయకులను హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. చంద్రబాబు మీద నంద్యాలలో జరిగిన సంఘట కూడా అలాంటిదే. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా జనసేన ఖండిస్తోంది.
పాలనపరంగా చాలా అనుభవంతో ఉన్న వ్యక్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అనిపిస్తుంది. ఈరోజు వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు, వైసీపీ పార్టీ, ప్రభుత్వం సంసిద్దంగా ఉందని చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులు అయితే.. మీ పార్టీకి సంబంధం ఏమిటి?. మీ పార్టీ వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తింది కదా. ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన మద్దతుదారులు, పార్టీ నాయకులు, అనుచరులు ముందుకు రావడం కచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. వారు ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటే ఎలా?
మీ నాయకులు అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్లలో ఉండొచ్చు.. కానీ మీకు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇతర పార్టీలకు వాళ్ల నాయకులను అరెస్ట్ చేస్తే.. మద్దతుగా కనీసం ఇంట్లో నుంచి బయటకు రానియకపోతే ఎలా?. దీనిని రాజకీయ కక్ష సాధింపుగానే మేము చూస్తున్నాం. చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.