2019 ఎన్నికలు: పవన్ కల్యాణ్ అంచనా ఇదీ..

Pawan Kalyan comment on next elections
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్తూ ఓట్లు అడుగుతున్నారు. 

ముగ్గురు నేతలు కూడా విస్తృతమైన పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినట్లే. అయితే, ఆయన అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుంది. మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని ఆయన గతంలో ఓసారి చెప్పారు. కానీ ఆ మూడు పార్టీలు ఏవనే విషయం చెప్పలేదు.

రాష్ట్రంలో టీడీపి, జనసేన, వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెసు పార్టీలు ఉన్నాయి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికే సిద్ధపడుతాయి కాబట్టి ఉభయ కమ్యూనిస్టు పార్టీలను ఆయన వదిలేసినట్లు భావించాలి. మిగతా పార్టీల్లో ఆయన ఏవి పోటీ కాదని భావిస్తున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, ఆయన బిజెపి, కాంగ్రెసు పార్టీలను పరిగణనలోకి తీసుకోలేదని భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని బిజెపి నాయకులు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఎన్నికల్లో సత్తా చాటలేదనే అభిప్రాయం ఉంది. అలాగే, కాంగ్రెసు పార్టీ కూడా పూర్తిగా బలహీనపడి, పోటీ ఇవ్వలేని స్థితిలోనే ఉంది.

రాష్ట్రంలో పుంజుకోవడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కాంగ్రెసు అటువంటి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు లేదు. అందువల్ల ప్రధానంగా టీడీపి, జనసేన, వైసిపిల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావించాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ అంచనా కూడా బహుశా ఇదే అయి ఉంటుంది.

loader