వాషింగ్టన్ డీసీ: ఎన్నికల్లో పరాజయంపై విశ్లేషణ సందర్భంగా విజయవాడలో ఓ కార్యకర్తపై తాను ఆగ్రహం చేసిన ఉదంతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఆయన తానా సదస్సులో తన పార్టీ సహచరుడు నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. తాను పార్టీ పెట్టడానికి కారణాలను, పార్టీ వైఫల్యంపై సుదీర్ఘంగా పవన్ మాట్లాడారు.

జనసేన విజయం సాధిస్తుందని అందరూ అంటుంటే తాను నమ్మలేదని, తన సభలకు లక్షల మంది వస్తారని, చేతులు ఊపడానికి ఉన్నంత హుషారు ఓటు వేయడానికి ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. తమ పార్టీ పరాజయంపై విశ్లేషణ చేస్తున్నప్పుడు ఒకతను తనకు సలహాలు ఇవ్వడం ప్రారంభించాడని ఆయన చెప్పారు. 

దాంతో ఓటు వేశావా అని అడిగానని, వేశానని చెప్పాడని, ఏ పార్టీకి వేశావని చెప్పాడని, జనసేనకు కాకుండా వేరే పార్టీకి వేశానని చెప్పాడని గుర్తు చేస్తూ సలహాలేమో నాకు, ఓటు వేరొకరికా అని అడిగానని అన్నారు. అది తప్పు కూడా కాదని, తాను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

తనకు రాజకీయాల ద్వారా పేరు ప్రఖ్యాతులు అవసరం లేదని, రాజకీయాల్లో కొత్తగా పేరు అవసరం లేదని, సినిమాల్లో ఇప్పటికే వచ్చిందని, సినిమాల్లో ఉంటే ఎవరూ తిట్టరు కూడా అని ఆయన చెప్పారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి జనసేనను స్థాపించినట్లు ఆయన తెలిపారు.