పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? పవన్ సంచలనం

First Published 3, Mar 2018, 5:29 PM IST
Pawan kalyan accused chandrababu for polavaram failure
Highlights
  • పోలవరం విషయంలో కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసే అర్హత కోల్పోయారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు

పోలవరం విషయంలో కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసే అర్హత కోల్పోయారన్నారు. పోలవరం పూర్తికాకపోతే అందుకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబే అంటూ స్పష్టంగా ప్రకటించారు. కేంద్రప్రాజెక్టును తన చేతుల్లోకి చంద్రబాబు ఎందుకు తీసుకున్నారో తనకు అర్ధం కావటం లేదని మండిపడ్డారు.

శనివారం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ (జెఎఫ్సీ) సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. పనిలో పనిగా చంద్రబాబుపైన కూడా ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజిపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయటంపై చంద్రబాబును తప్పుపట్టారు. ప్రత్యేకహోదా పేరుతో లబ్దిపొందిన నేతలు ఇపుడు ప్రజలను తప్పుపోవ పట్టిస్తున్నట్లు మండిపడ్డారు.

ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు నిలదీయలేకపోతున్నారో అర్దం కావటం లేదన్నారు. బిజెపి, టిడిపి ఎంపిలు ఏమి చేస్తున్నరంటూ నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడుతుంది. దీని వల్ల రాజకీయ సమీకరణలు కూడా మారిపోతాయంటూ బిజెపి, టిడిపిలను హెచ్చరించారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై స్పష్టత లేదని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పటం విచిత్రంగా ఉందన్నారు. జాతీయ విద్యాసంస్ధల ఏర్పాటుకు వందల కోట్ల రూపాయలు అవసరమైతే ఇచ్చింది మాత్రం చాలా తక్కువన్నారు. కేంద్రం వైఖరిని వివరిస్తూ విభజనతో ఇప్పటికే దెబ్బతిన్న ప్రజల విషయంలో కేంద్రం ‘పుండుమీద కారం రాసినట్లు’గా ఉందన్నారు.

విశాఖపట్నం రైల్వేజోన్ గురించి మాట్లాడుతూ, రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం విలాస్ పూర్ ను ప్రత్యక రైల్వేజోన్ గా ఏర్పాటు చేసినపుడు విశాఖపట్నంను ఎందుకు చేయలేకపోతున్నారంటూ నిలదీశారు. యుపిఏ ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన హామీని ఎన్డీఏ అమలు చేయలేకపోవటం బాధాకరమన్నారు.

రాష్ట్ర విభజన హామీలను, చట్టాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతున్నదో తనకు అర్ధం కావటం లేదన్నారు. పవన్ తన ప్రెస్ మీట్ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అనే తప్ప చంద్రబాబునాయుడు పేరును ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్డీఏ చేసిన పనులకు జనాలు తనను ప్రశ్నిస్తున్నట్లు వాపోయారు. బిజెపి, టిడిపి కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంగా అధికారాన్ని పంచుకుంటున్నపుడు ఇంకా స్పష్టత లేకపోవటం ఏంటని ప్రశ్నించారు.

loader