జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏం చెప్పబోయి ఏం చెబుతున్నాడో అర్ధం కావటం లేదు. జనాలందరూ మరచిపోయిన ప్రజారాజ్యంపార్టీ గురించి, చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. పిఆర్పి అన్నది విఫల ప్రయోగమన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో రాజకీయనేతగా వేషాలు వేసినంత ఈజీ అనుకుని పార్టీని ఏర్పాటు చేసి దారుణంగా దెబ్బతిన్నది వాస్తవం. అసంఖ్యాంగా అభిమానులున్న చిరంజీవి రాజకీయ నేతగా విఫలమయ్యారంటే అందుకు స్వయంకృతం తప్ప మరేం కాదు.

పార్టీ ఏర్పాటైనప్పటి నుండి కుటుంబసభ్యులని, సామాజికవర్గమని, సినీమా సహచరులని, డబ్బుని ఇలా ఏదో ఒక కారణం చెప్పి పార్టీ పరువును బజారున పడేసారు. చివరకు సామాజికవర్గంకు చెందిన నేతలకు టిక్కెట్లు ఇవ్వాలన్నా కూడా డబ్బులు తీసుకున్నారని జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పటికీ సామాజికవర్గం నేతలే  చిరింజీవి కుటుంబాన్ని అమ్మనాబూతులు తిట్టుకుంటుంటారు.

ఇక, తాజాగా పవన్ మాట్లాడుతూ, చిరంజీవి పక్కన స్వార్ధపరులు చేరిపోవటం వల్లే పిఆర్పీ దెబ్బతిన్నదని అన్నారు. లేకపోతే ఇప్పటికి చిరంజీవే ముఖ్యమంత్రిగా ఉండేవారట. ఇక్కడ కూడా పవన్ తన సోదరుడు చిరంజీవి అజ్ఞానాన్నే బయటపెట్టారు. చిరంజీవి వద్దకు వచ్చే వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకునేందుకే వస్తారు. ఎటువంటి వారిని దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని సలహాదారుగా ఎంచుకోవాలనే విజ్ఞత చిరంజీవికి ఉండాలి. ఇక్కడ కూడా సామాజికవర్గం పేరుతో అవుట్ డేటెడ్ నేతలను దగ్గరకు తీసుకున్నది చిరంజీవే. జనాల్లో ఏనాడు పనిచేయని, ప్రజాబలం లేని నేతలకు టిక్కెట్లు ఇచ్చింది కూడా చిరంజీవే. అభ్యర్ధుల ఎంపికలో ప్రాంతాలవారీగా కుటుంబసభ్యులు పంచుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో ఎన్నో వినిపించాయి.

మొత్తానికి ఎన్నికలు జరిగితే అందులో పిఆర్పీకి 18 సీట్లు వచ్చాయి. అయితే, 18 మంది ఎంఎల్ఏలతో ఐదేళ్ళు కూడా ప్రతిపక్షంగా నిలవలేకపోయారు. అప్పట్లో చిరంజీవి గానీ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయకపోయుంటే ఇపుడు పవన్ చెబుతున్న మాటలకు విలువుండేది. చిరంజీవిని ఎవరో మోసం చేసారని అంటున్న పవన్ పిఆర్పిని నమ్మి ఓట్లేసిన 70 లక్షల మంది ఓటర్లను చిరంజీవి మోసం చేయలేదా? కాంగ్రెస్ లో విలీనం చేసినందుకే కదా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం, కేంద్రమంత్రి పదవి దక్కింది. అంతిమంగా ఇక్కడ మోసపోయిందెవరు?