జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీలోని పెద్దలకు వివరించేందుకు పవన్ అక్కడకి వెళ్లారు. కాగా... ఢిల్లీలోని నేతలకు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిప్రాయం ఇదేనంటూ పవన్ ఓ ట్వీట్ చేశారు.

జగన్ పై పవన్ పలు విమర్శలు చేస్తూనే.. జగన్ కి సంబంధించిన ఓ కార్టూన్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు. రెండు కాళ్లకు జగన్ బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. సీఎం జగన్ పై ఢిల్లీలో ఉన్న అభిప్రాయం ఇదేనని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉండగా... అందులో 151 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. కానీ ఐదు నెలల్లోనే 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిన్నదని ఆయన మండిపడ్డారు. 50మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత కేవలం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు.

 

ఇదిలా ఉండగా...జగన్ పై పవన్ గతంలో కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుపై కోపంతోనో, గత ప్రభుత్వ విధానాలు నచ్చకనో రాజధానిని తరలించాలని చూస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరోకటి లేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారని నిలదీశారు. 

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు ఏకగ్రీవ తీర్మాణం చేశారు కదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు అబ్జక్సన్ చెప్పలేదన్నారు. అంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేస్తేనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయ్యిందన్నారు. 

అనంతరం ప్రధాని నరేంద్రమోదీ వచ్చి శంకుస్థాపన చేయడం అన్నీ జరిగిపోయాయన్నారు. నిర్మాణాలు కూడా జరిగిపోతున్న తరుణంలో రాజధానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు పరోక్షంగా లీకులు ఇవ్వడం సరికాదన్నారు. 

AlsoRead కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం షాక్: సుప్రీంలో అఫిడవిట్.

రాజధాని నిర్మాణం ఆపేస్తే జగన్మోహన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణలకు నష్టం జరగదన్నారు. రాష్ట్రప్రజలకు, రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం వల్ల కోటి మంది పస్తులతో, అప్పులతో బాధపడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా, రాజధానికోసం అన్ని ఎకరాల భూమి ఎందుకు అని సందేహం వస్తే సైజు కుదించాలే తప్ప తరలించే ప్రయత్నాలు చేయడం సబబు కాదన్నారు. అమరావతి నిర్మాణం జరిగితే భవన నిర్మాణ కార్మికులు బాగుపడతారని సూచించారు.  

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారంటూ తిట్టిపోశారు. రాజధాని భూసేకరణను అడ్డుకునే దమ్ము వైసీపీకి లేకుండా పోతే తనను ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. వైసీపీ పిలిస్తేనే తాను అమరావతి వచ్చాననని భూసేకరణను అడ్డుకుంది తానేని చెప్పుకొచ్చారు. జనసేనకు ఉన్న దమ్ము వైసీపీకి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

లేనిపక్షంలో పులివెందులలో రాజధాని పెట్టుకుంటారంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాను కూడా అక్కడకే వస్తానన్నారు. అమరావతి రాజధానిని పులివెందులలో పెట్టుకుంటానని 151 మంది ఎమ్మెల్యేలతో తీర్మానం చేయండంటూ ఎద్దేవా చేశారు.