జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రజా పోరాట యాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా పవన్.. ప్రజా పోరాట యాత్ర పేరిట పలు జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన అనంతపురంలో కూడా పర్యటించారు. అయితే.. ఆ పర్యటనలో పవన్ రైతులను కించపరిచారంటూ విమర్శలు వెలువడుతున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపురంలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ రెండో రోజైన సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4.30 వరకూ తాను బస చేసిన శ్రీ7 కన్వెన్షన్‌ సెంటర్‌లోనే ఉన్నారు. అనంతరం సాయంత్రం సమయంలో అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన రైతులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉండగా 4.45 గంటలకు కారులో గ్రామానికి చేరుకుని వాహనం దిగి ఓ చీనీ తోటలోకి వెళ్లారు. 

ఇదే సమయంలో పవన్‌ను చూసేందుకు గ్రామస్తులు వచ్చారు. ఇంతలో పొలంలో దుమ్ము లేవడంతో వేగంగా అడుగులేస్తూ వచ్చి తిరిగి కారులో కూర్చున్నారు. చేతులతో తల కొట్టుకొంటూ అసహనం ప్రదర్శించారు. కొంతమంది  ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్లు కనిపించడంతో వారితో మాట్లాడి తాను బస చేసిన ప్రాంతానికి  తిరుగు పయనమయ్యారు. ఎంతసేపటికీ పవన్‌ ముఖాముఖి వేదిక వద్దకు రాకపోవడంతో విసుగు చెందిన రైతులు, గ్రామస్తులు ఆరా తీశారు. 

దుమ్ము రేగుతోందని పవన్‌ వెళ్లిపోయారని తెలియడంతో అందరూ నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా.. పవన్..  ఇటీవల మృతి చెందిన తన పార్టీ నేత ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించాల్సి ఉంది. అది కూడా పవన్ సరిగా చేయకపోవడం గమనార్హం.  చనిపోయిన నేత ఫోటోని తన వాహనం దగ్గరకు తెప్పించుకొని.. ఫోటో చేతిలో తీసుకుని దండం పెట్టి తిరిగి వారికి అప్పగించి పవన్‌ కారెక్కి వెళ్లిపోయారు. ఈ తరహా పరామర్శపై గ్రామస్తులు కంగుతిన్నారు. ఇంటి వద్దకు వచ్చి, ఇంట్లోకి వెళ్లకుండా ఫోటో తెప్పించుకుని చూడటం ఏమిటని విమర్శిస్తున్నారు.