విజయనగరం: హైదరాబాద్ మహానగరాన్ని తానే కట్టానని, తానే నిర్మించానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే హైదరాబాద్ నగరాన్ని నిజాం కట్టాడని కేసిఆర్ అంటున్నారని విమర్శించారు. ప్రపంచమంతా తిరిగి ఉక్కు సంకల్పంతో పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు తానే కట్టినట్లు చెప్పారు. 


కళాశాలలు, ఎలిమెంటరీ స్కూల్స్ ప్రతి ఒక్కటీ తానే ఏర్పాటు చేశానని అందువల్లే హైదరాబాద్ పై తనకు హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమీ లేదన్నారు. సైబరాబాద్ నిర్మాణం చేశానని తెలిపారు. కేంద్రంలో  ఎన్డీయే ఫ్రంట్ ఉంటుందని మూడో ఫ్రంట్ అనేది ఉండదన్నారు. కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడది ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే నువ్వు ఉండేవాడివా అంటూ చంద్రబాబు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని నిలదీశారు. 

తెలుగుదేశం పార్టీ ఒక్కప్రాంతానికి చెందిన పార్టీ కాదన్నారు. తెలుగుజాతి ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండి తీరుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

తెలంగాణకు తాను అన్యాయం చెయ్యలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తాను పాటుపడినట్లు ఎవరూ పాటుపడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికోసం పోరాడిన వారిని చూస్తే చంద్రబాబు నాయుడు పేరు మెుదటి స్థానంలో ఉంటుందన్నారు. 

తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తాను ఎంతో శ్రమించానన్నారు. విద్యారంగం అగ్ర స్థానంలో ఉందంటే అందుకు తాను చేసిన కృషే కారణమన్నారు. అటు ఆంధ్రా ఇటు తెలంగాణలో విద్యావ్యవస్థ బలోపేతం తన వల్లే జరిగిందన్నారు. 

తన హయాంలోనే మత సామరస్యం కోసం పోరాటం ప్రారంభమైందన్నారు. గుజరాత్ రాష్ట్రం గోద్రా మతకలహాల్లో తానే మెుట్టమెుదట స్పందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆ నాటి సీఎం మోదీ రాజీనామా కోరింది తానేనని గుర్తు చేశారు. 

ఇకపోతే ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా తానే మెుదటి స్పందించానని తెలిపారు. కొంతమందికి వివక్ష చూపడం సరికాదన్న నినాదంతో ట్రిపుల్ తలాక్ పై స్పందించినట్లు చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ప్రజల కోసం, తెలుగు జాతి ఐక్యమత్యం కోసం, తెలుగు జాతి అభివృద్ధికోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ జెండా అవసరమని చెప్పుకొచ్చారు. బుధవారం తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణలో ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.  

ధనిక రాష్ట్రంగా తెలంగాణకు పేరు వచ్చిందంటే అది తన వల్లేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సంపద రావడానికి, ఉద్యోగలు రావడానికి తానే కారణమన్నారు. అయితే తెలంగాణను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తనను విమర్శిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అంటూ మండిపడ్డారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ లు ఇద్దరూ కేసిఆర్ కు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో పోటీ చెయ్యడం లేదని విమర్శించారు. కేసీఆర్ అంటే వారిద్దరి వెన్నులో వణుకు పుడుతుందని విమర్శించారు. కానీ ఆంధ్రాలో మాత్రం మనమీద పెత్తనం చెలాయించాలని చూస్తారని ఎద్దేవా చేశారు.