మోడికి వ్యతిరేకంగా టిఎంసి అధినేత మమతా బెనర్జీ, సిపిఎం ఏకమవుతుండటం గమనార్హం.

పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఈ కారణంగానే 16వ తేదీ నుండి మొదలవ్వనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా వాడి వేడిగా జరుగనున్నాయి. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఎండగట్టటానికి ప్రతిపక్షాలు నడుంకడుతున్నాయి. ఈ విషయంలో మోడికి వ్యతిరేకంగా టిఎంసి అధినేత మమతా బెనర్జీ, సిపిఎం ఏకమవుతుండటం గమనార్హం

. మొన్నటి 8వ తేదీన దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లైన వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రకటించారు. దాంతో ప్రధాని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పుడు మొదలైన ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. 

ప్రధాని చేసిన ప్రకటన ఒకవిధంగా జాతీయ స్ధాయిలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించినట్లైంది. ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా రియల్ఎస్టేట్, రవాణా, వస్తు సేవలు, వర్తక, వాణిజ్యరంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇక సామాన్య ప్రజల సమస్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రధాని ప్రకటన వెలువడే సమయానికి వేతన జీవులకు అప్పుడే జీతాలు వచ్చాయి కాబట్టి చెల్లింపులన్నీ అప్పుడే మొదలుపెట్టారు.

ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో ఎక్కడ కూడా ఆ నోట్లను తీసుకునే వారే కనబడలేదు. ఇటు బ్యాంకుల్లో తీసుకోవటానికేకాకుండా అటు ఇవ్వటానికీ ఆంక్షలు. అంతేకాకుండా బ్యాంకుల్లో నగదు నిల్వలు అయిపోవటం, ఏటిఎంలు పనిచేయకపోవటంతో దేశవ్యాప్తంగా ఒక విధంగా ఆర్ధిక కర్ఫ్యూ విధించినట్లు ప్రజల విలవిల లాడిపోయారు.

పెద్ద నోట్లు రద్దయినప్పటి తరువాత ప్రజల ఇబ్బందులను గమనిస్తున్న ప్రతిపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిఎస్పీ, ఎస్పి, శివసేన తదితర పార్టీలు ఏకమయ్యాయి. బద్ద శతృవులైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరికి ఫోన్ చేసి ఐక్యంగా ఉద్యమాలు చేయల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పటం గమానర్హం.