అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ సమరం సాగిస్తున్నారు. 

పరిటాల సునీతకు సంబంధించిన ఓ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. దానిపై ఆగ్రహించిన శ్రీరామ్ అనంతపురంలోని సాక్షి కార్యాలయం ముందు ధర్నా చేశారు.

తాజాగా ఆయన ఆ పత్రికపై ట్విట్టర్ లో ఓ వ్యాఖ్య చేశారు. "నా మీదనో నా కుటుంబం మీదనో తప్పుడు రాతలు రాసినా పట్టించుకోను. నాకు నష్టం జరిగినా నేను పెద్దగా తీసుకోను. అదే ప్రజలకు, సమాజానికి నష్టం జరుగుతుంది.. ప్రమాదంగా మారుతుందంటే ఏ మాత్రం సహించను. ఎంత దూరమైనా వెళ్తా" అని ఆయన వ్యాఖ్యానించారు.

 

"అభివృద్ధికి అడ్డంకిగా మారి తప్పుడు రాతలతో నిందారోపణలతో రెచ్చిపోతే నేడు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపాను... మీరు మరోసారి ఇలా చేస్తే మరో మెట్టు ఎక్కుతా" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.