జెసి బ్రదర్స్ పై  పరిటాల వర్గం తిరుగుబాటు

జెసి బ్రదర్స్ పై  పరిటాల వర్గం తిరుగుబాటు

జెసి సోదరుల పీఠాలు కదులుతున్నాయా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనక తప్పదు. ఎందుకంటే, అటు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అయినా, ఇటు తాడిపత్రి నియోజకవర్గంలో అయినా జెసి సోదరులపై బాహాటంగానే తిరుగుబాటు మొదలైంది. అది కూడా టిడిపి నేతల నుండే కావటం గమనార్హం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి తిరుగుబాట్లతో చివరకు పార్టీ పుట్టి ముణుగుతుందేమోనని పలువురు అనుమానిస్తున్నారు.

విషయం ఏమిటంటే, అనంతపురం జిల్లాలో జెసి సోదరుల హవా బాగా నడుస్తోంది. అనంతపురం ఎంపిగా జెసి దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే, వీరి ఒంటెత్తు పోకడలతో పార్టీలోనే శతృవులు పెరిగిపోయారు. పార్టీ బయటే కాదు, పార్టీ నేతల్లో కూడా తమకు గిట్టని వారిపై పోలీసులను ఉసుగొలుపుతున్నారంటూ మిగిలిన నేతలు మండిపోతున్నారు. తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

తాడిపత్రిలో ఏం జరిగిందంటే, ప్రభాకర్ రెడ్డి అంటే నియోజకవర్గంలోని మిగిలిన టిడిపి నేతలకు పడటం లేదు. ఎంఎల్ఏ అనుచరులు మొన్న మంగళవారం టిడిపి నేత, పరిటాల వర్గీయుడైన కాకర్ల రంగనాధ్ తమ్ముడు శేఖర్ పై దాడి చేసారు. ట్రాన్స్ పోర్టు కార్యాలయాన్ని, లారీతో పాటు ఓ ఇన్నోవా కారును కూడా ధ్వంసం చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విషయం తెలుసుకున్న నిందుతులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.

లొంగిపోయిన వారు శేఖర్ పై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బాధితుడిని కూడా తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. నియోజకవర్గంలోని మిగిలిన నేతలతో కలిసి బుధవారం తెల్లవారి రంగనాధ్ పోలీస్టేషన్ కు చేరుకున్నారు. తన తమ్ముడిని వదిలేయమని అడిగితే పోలీసులు నిరాకరించారు. దాంతో రంగనాధ్ పోలీసు స్టేషన్ ముందే ధర్నాకు దిగారు. సరే, మొత్తానికి పోలీసులు శేఖర్ ను వదిలిపెట్టారనుకోండి అది వేరే సంగతి.

తర్వాత అదే విషయమై రంగనాధ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ, జెసి సోదరులపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. పాతికేళ్ళుగా జెండామోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. వలస నేతలే టిడిపిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జెసి సోదరులకు గడ్డు కాలమే అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos