బిజెపితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకున్న ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ పై పడింది.

అమరావతి: బిజెపితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకున్న ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ పై పడింది. చంద్రబాబు ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. పొమ్మని నేరుగా చెప్పకుండా ఆయనంత ఆయన వెళ్లిపోయే విధంగా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

పరకాల ప్రభాకర్ ప్రాధాన్యాన్ని చంద్రబాబు గత కొంత కాలంగా తగ్గించారని సమాచారం. పరకాల అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎం గ్రూపునకు చెదిన సంజయ్ అరోరాను ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఇటీవలి కలెక్టర్ల సమావేశం సందర్భంగా పరిచయం చేశారు. దాన్ని బట్టి పరకాల ప్రభాకర్ ప్రాధాన్యం ఏ మేరకు తగ్గిందో ఊహించుకోవచ్చు.

పరకాల ప్రభాకర్ ప్రభుత్వంలో ఉంటే తమకు సంబంధించిన కీలకమైన సమాచారం, ఇతర విషయాలు కేంద్రానికి చేరే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానిస్తున్నట్లు తెలిస్తోంది. ఆయనను సాగనంపే ఉద్దేశంతోనే చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన స్థానంలో సంజయ్‌ అరోరాను మీడియా సలహాదారుగా చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పరిచయం చేశారని అంటున్నారు.

ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్‌ గురించి సంజయ్‌ ఆరోరాతో చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇప్పించారు. మీడియా సలహాదారు, సమాచార శాఖ కమిషనర్‌ లను కాదని కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రచార వ్యవహారాలు చూస్తున్న సంజయ్‌తో ప్రజెంటేషన్‌ ఇప్పించడం, ఆయన్ను కమ్యూనికేషన్‌ సలహాదారుగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

పరకాల ప్రభాకర్‌ను 2014లో ప్రభుత్వ మీడియా సలహాదారుగా చంద్రబాబు నియమించుకున్నారు. పరకాల అప్పటి నుంచి మీడియా విషయాలే కాకుండా ప్రభుత్వ, టీడీపీ వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.