గుంటూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని... డాక్టర్ సుధాకర్ వ్యవహారం లాగే అనితారాణి విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు పోరాడుతున్నా వారి సేవలను ప్రభుత్వం గుర్తించడంలేదన్నారు అనురాధ.

''అవినీతి చేసిన కిందిస్థాయి సిబ్బందిని మందలించే ప్రయత్నం చేసిన అనితారాణిని వైసీపీ నేతలు వేధించారు. ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారు. న్యాయం కోసం అనితారాణి పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదు. రెండున్నర నెలల నుంచి అనితారాణి మానసిక వ్యధ అనుభవిస్తోంది. డిప్యూటీ సీఎం స్థాయి వారు కూడా తనపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు''  అని  ఆరోపించారు.  

''డాక్టర్ అనితారాణి బాత్రూమ్ కు వెళ్లినప్పుడు వైసీపీ నేతలు ఫోటోలు తీశారు. తోటి సిబ్బంది అనితారాణిపై అసత్యాలు మాట్లాడుతున్నారు. డాక్టర్ పై అబాండాలు వేయడం సరికాదు. ఏంచేస్తే నీకు ఉద్యోగం వచ్చిందని వైసీపీ నాయకుడులు మాట్లాడ్డమేంటి? మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ ను ఇలా వేధించడం ఎంతవరకు సబబు?'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

''జగన్ ప్రభుత్వం వేసే సీఐడి విచారణపై తనకు నమ్మకం లేదని అనితారాణి చెబుతున్నారు. ఆమె డిమాండ్ మేరకు సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు ఈ ప్రభుత్వం?'' అని ప్రశ్నించారు. 

read more  డాక్టర్ అనితారాణి వివాదం: విచారణకు చిత్తూరుకు చేరుకొన్న సీఐడీ

''జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీఐడి విచారణ ప్రకటించాక మహిళా కమిషన్ హడావుడి చేస్తోంది. ఆత్మకూరులో దళిత మహిళలు ఇబ్బంది పడుతుంటే మహిళా కమిషన్ స్పందించిందా? రాష్ట్రంలో అత్యాచారాలకు గురైన మహిళలకు న్యాయం చేశారా? అమరావతి మహిళలను బూటు కాలుతో తన్నినప్పుడు ఈ మహిళా కమిషన్ ఏమైంది? కరోనా కాలంలోనూ న్యాయం కోసం సుధాకర్ తల్లి రోడ్డెక్కాల్సి వచ్చింది. సుధాకర్ కుటుంబసభ్యులను ఈ మహిళా కమిషన్ పరామర్శించలేదే?'' అంటూ అనురాధ నిలదీశారు. 

''ప్రశ్నించిన వారిపై పిచ్చివాళ్లుగా ముద్ర వేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మానసిక స్థితి సరిగా లేదు. అనితారాణికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం అండగా నిలుస్తుంది. జగన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారని బిఆర్ అంబేద్కర్ ముందే ఊహించారు కాబట్టే దళితులకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు  కల్పించారు'' అన్నారు. 

''రెండున్నర నెలల తర్వాత అనితారాణి స్పందించడమేంటని వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడ్డం సరికాదు. అమరావతి అంశంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది కానీ ఏపీ మహిళా కమిషన్ స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా మహిళా కమిషన్ స్వతంత్యంగా వ్యవహరించాలి. అనితారాణిని మహిళా కమిషన్ కలిశాక ఆ రిపోర్టును బహిర్గతం చేయాలి'' అని అనురాధ డిమాండ్ చేశారు.