Asianet News Telugu

క్యాస్ట్ వైరస్సా, కరోనా వైరస్సా అన్నవారు ఇప్పుడు క్వారంటైన్ లో: అనురాధ ఎద్దేవా

ఏపీలో మార్చి 22వతేదీన 5 పాజిటివ్ కేసులుంటే ఇప్పుడు 58వేలపైచిలుకు కేసులు నమోదయ్యాని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తెలిపారు.

panchumarthi anuradha satires on ycp govt over corona
Author
Vijayawada, First Published Jul 23, 2020, 6:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: కరోనా ఏ రకంగా విజృంభిస్తుందో అందరం చూస్తూనే ఉన్నామని...మార్చి 22వతేదీన రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులుంటే ఇప్పుడు 58వేలపైచిలుకు కేసులు నమోదయ్యాని టీడీపీ అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ తెలిపారు. దీనిపై సమీక్ష చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ఆమె  నిలదీశారు.  

గురువారం ఆమె తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మంత్రి పదవులు, భోగాలు అనుభవించడానికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రజల ప్రాణాలకు ఎందుకివ్వడంలేదో అర్థం కావడంలేదన్నారు. పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా పోతుందని ముఖ్యమంత్రి అన్నప్పుడే ఆయన వ్యాఖ్యల ప్రభావంతో ప్రజలు వైరస్ ను సీరియస్ గా తీసుకోరని ఆనాడే టీడీపీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మాస్కు కూడా వేసుకోకుండా ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారో ఆయనే చెప్పాలన్నారు. 

వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలోనే చంద్రబాబునాయుడు ఏం చేయాలో ప్రజలకు వివరిస్తూనే... సీబీఎన్ ఫౌండేషన్ సహాయసహకారాలతో వైద్యులు, సైంటిస్టులతో చర్చించి, వారినుంచి సేకరించిన సమాచారాన్ని పీఎంవోకు పంపడం  జరిగిందన్నారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు అనుభవాన్ని ఉపయోగించుకోలేక పోయిందన్నారు. 

ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే ప్రభుత్వ పాలనా? అని అనురాధ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు ఉంటే ఉన్నాయి...పోతే పోయాయి అనేధోరణితో ప్రభుత్వం   వ్యవహరించడం దుర్మార్గమన్నారు. కరోనా ఉధృతి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ డబ్బుపిచ్చితో మద్యం షాపులను నిర్వహించడం, అధికారపిచ్చితో ఎన్నికలు జరపాలనడం, ప్రచారపిచ్చితో మంత్రులు, ప్రజాప్రతినిధులే కరోనాబారిన పడటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 108-104 అంబులెన్సులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదని... చనిపోయిన వారిని తరలించడానికి కూడా అవిరావడం లేదన్నారు. 

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా చనిపోయిన వారిని జేసీబీలతో తరలించే దారుణమైన పరిస్థితిని చూస్తున్నామని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం మద్యం దుకాణాలు తెరవద్దని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అనురాధ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ప్రజలు గుంపులు, గుంపులుగా గుమికూడకుండా చూడాల్సిన ప్రభుత్వమే మద్యం షాపులు తెరవడం ఏమిటన్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్నివిస్మరించిందన్నారు. కరోనా కారణంగా కొన్నాళ్లు  మద్యం దుకాణాలు మూసేయడంతో ప్రజలు తాగకపోయినా బతికారని, అలాఉన్నవారిని మద్యం తాగేలా ప్రోత్సహిస్తూ, మద్యం దుకాణాలు తెరిచింది ఈప్రభుత్వం కాదా? అని ఆమె ప్రశ్నించారు. మద్యం దుకాణాలవల్లే కరోనా కేసులు పెరిగాయని ప్రజలంతా భావిస్తున్నారని... జే-ట్యాక్స్ పేరుతో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజలప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.  

read more   ఆ ఒక్కటీ చేసి ప్రాణాలు కాపాడండి: సీఎం జగన్ కు రామ్మోహన్ నాయుడు లేఖ

ప్రజలు చస్తే చచ్చారు.. మాకేంటి అనే భావన ప్రభుత్వానికి ఉండవచ్చా? అని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బెల్టుషాపులా మారాడని, వారి ద్విచక్రవాహనాలు మొబైల్ బెల్టుషాపుల్లా తయారయ్యాయని అనురాధ ఎద్దేవా చేశారు. నిజంగా ఈ ప్రభుత్వం మద్యం షాపులు తొలగించి ఉంటే వేలకోట్ల ఆదాయం ఎక్కడినుంచి వస్తుందన్నారు. 

ఒక్క రోజులో 6వేల పాజిటివ్ కేసులు వచ్చినా ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. స్థానిక ఎన్నికలు జరపవద్దని టీడీపీ చెప్పినప్పుడు క్యాస్ట్ వైరస్సా, కరోనా వైరస్సా అన్నవారంత ఇప్పుడు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉన్నారన్నారు. ఈ వారమంతా ప్రభుత్వ తీరుకి నిరసనగా ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు. 

ఉపాధిలేక బతకడం కష్టమైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలానే ప్రజల ప్రాణాలకోసం ముందుండి పోరాడుతూ చనిపోయిన ఫ్రంట్ వారియర్స్ కుటుంబాలకు, మీడియా ప్రతినిధులకు కూడా రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

క్వారంటైన్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని, దానివల్ల సదరు కేంద్రాల్లోని వారికి సరైన ఆహారం అందడం లేదన్నారు. రూ.50వేల కోట్ల వరకు ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం ఆ నిధులన్నీ ప్రజలకు ఖర్చుచేయకుండా ఏం చేసిందని అనురాధ నిలదీశారు. మానవత్వంతో ఆలోచన చేయకుండా, రాజకీయాలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు.   

ప్రజలకు అభద్రతా భావం కల్పిస్తూ అధికార పార్టీ నాయకులే కరోనా చికిత్స కోసం పక్కరాష్ట్రాలకు వెళుతున్నారంటే ఈ ప్రభుత్వంపై వారికి నమ్మకం లేకే కదా? అని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చిన కరోనా నిధులను ప్రభుత్వం ఎక్కడ ఖర్చుపెట్టిందో తెలియచేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తక్షణమే మద్యం దుకాణాలు మూసేయాలని అనురాధ డిమాండ్ చేశారు. 

మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వారే మాస్కులు పెట్టుకోకుండా ఉంటే యువకులకు, ప్రజలకు వారేం సందేశం ఇస్తున్నారన్నారు. ప్రపంచమంతా అల్లాడుతుంటే మంత్రి పదవులు, ప్రమాణస్వీకారాలతో కాలయాపన చేయడమేంటన్నారు. తెలుగుదేశం డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అనురాధ తేల్చిచెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios