Asianet News TeluguAsianet News Telugu

తోడు పేరుతో ఉన్న గూడునూ కొల్లగొడతారా..?: జగన్ సర్కార్ ను నిలదీసిన పంచుమర్తి అనురాధ

కేంద్రం స్వనిధి పేరుతో ఇస్తున్న నిధులకు అదనంగా రూపాయి చేర్చకపోగా.. అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకోవడం హేయమని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 

panchumarthi anuradha satires on jaganna thodu scheme akp
Author
Vijayawada, First Published Jun 8, 2021, 3:51 PM IST

విజయవాడ: జగనన్న తోడు పేరుతో రాష్ట్రంలోని చిరు వ్యాపారులను ప్రభుత్వం నిండా ముంచుతోందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వడ్డీ లేని రుణాలు అంటూ  హడావుడి చేస్తున్ సీఎం జగన్ రెడ్డి... వడ్డీలు తామే చెల్లిస్తామన్న భరోసా మాత్రం బ్యాంకులకు ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా తోడు ద్వారా లబ్ది పొందిన వారి జుట్టును బ్యాంకుల చేతిలో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. 

''కేంద్రం స్వనిధి పేరుతో ఇస్తున్న నిధులకు అదనంగా రూపాయి చేర్చకపోగా.. అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకోవడం హేయం. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చిన్న వ్యాపారం చేసుకునే వారికి కార్పొరేషన్ల ద్వారా రూ.2లక్షల వరకు రుణం ఇచ్చి అందులో రూ.లక్ష వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేకుండా సబ్సిడీ ఇచ్చేది'' అని అనురాధ గుర్తుచేశారు. 

''నేడు జగన్ రెడ్డి కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, మద్యం ధరలు పెంచి... రెండేళ్లలో రూ70 వేలకోట్ల భారం మోపి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. ఇప్పుడు రూ.10వేలు చేతిలో పెట్టి సర్దుకుపొమ్మనడం దుర్మార్గం కాదా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించడం మాని.. చిల్లర విదిల్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నందుకు సిగ్గుపడాలి'' అని మండిపడ్డారు. 

read more  ఆందోళనకరంగా సీఎం జగన్ మానసిక పరిస్థితి...అందువల్లే ఈ నిర్ణయం: లోకేష్ సంచలనం

''గతేడాది తోడు ప్రారంభోత్స సమయంలో ఇచ్చిన పత్రికా ప్రకటనలో 10లక్షల మందికి రుణాలు మంజూరు చేస్తున్నామన్న జగన్ రెడ్డి తెలిపారు. కానీ ఈ రోజు ప్రకటనలో 5.35 లక్షల మందికే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో ఏది నిజమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రచారంలో ఒకటి చెప్పి.. పత్రికల్లో మరొకటి చెప్పి, అమలులో మరొకటి చేస్తూ రాష్ట్రంలోని పేదల ఆశలతో ఆటలాడుకుంటున్నారు'' అని విమర్శించారు. 

''ఎన్నికలకు ముందు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నెత్తిన భస్మాసుర హస్తం పెట్టి ప్రజల బతుకుల్ని బుగ్గి చేస్తున్నాడు. ఈ దొంగ ప్రచారాలు ఇంకెన్నాళ్లు జగన్ రెడ్డీ.? మీరు వడ్డీ రాయితీ కింద ఇచ్చే సొమ్ముకంటే పత్రికా ప్రకటనలకు ఖర్చు చేసే సొమ్మే ఎక్కువగా ఉంది. మీ ప్రకటనల పిచ్చితో రాష్ట్ర ఖజానాను హోల్ సేల్ గా దోచుకుంటున్నారు. పథకం కోసం ఖర్చు చేసిన ఖర్చు కంటే.. ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుండడం వాస్తవం కాదా.? ఇదేనా సంక్షేమమంటే.?'' అని అనురాధ నిలదీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios