అమరావతి: ఎన్నికల ప్రచారంలో పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం, బైబిల్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించారని... అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి? అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అమరావతి ప్రజలు 232 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారని... వారి ఆవేదన పట్టదా అని అడిగారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని 33 వేల ఎకరాలు రైతులు ఇస్తే వారి త్యాగాలను ఎగతాళిగా తీసుకుంటారా? అని మండిపడ్డారు. 

''రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినా బిల్లులు ఎలా తెచ్చారు? అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. ప్రతిరోజూ విధ్వంసానికి వైసీపీ ఎందుకు జై కొడుతోందో చెప్పాలి. వైసీసీ అధికారంలోకి వచ్చాక 34 పథకాలు రద్దు చేసింది. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి. 78 సార్లు కోర్టు మొట్టికాయలు వేసింది. 78మంది రైతులు చనిపోతే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రైతుల పక్షాన నిలబడలేదు'' అని అన్నారు. 

''వైసీపీ ఇసుక పాలసీ వల్ల 64మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 511మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రూ. 3000 వేల కోట్ల భూ కుంభకోణాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారు. రూ. 70 వేల కోట్ల అప్పు తెచ్చారు. కానీ చేసిన అభివృద్ది శూన్యం. రూ. 50 వేల కోట్ల పన్నుల భారం ప్రజలపై మోపారు'' అని మండిపడ్డారు. 

''కరోనా సమయంలోనూ కరెంటు బిల్లులు పెంచి ప్రజలను ఇబ్బందులపాలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా అని వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి'' అని సూచించారు. 

read more   వారు ఒప్పుకుంటే...ఆ ఇంట్లో సచివాలయం, అక్కడ రాజధాని అయినా ఓకే: వర్ల సంచలనం

''ఏపీ నడిమధ్యలో అమరావతి ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు అందుబాటులో ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో ఒకే రాజధాని అని స్పష్టంగా ఉంది. మూడు రాజధానులు చేయడం మీ పరిధిలో లేదు. ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదం లేకుండా మూడు రాజధానులు ఎలా చేస్తారు? అమరావతే రాజధాని అని వైసీపీ నేతలు చెప్పలేదా?'' అని ప్రశ్నించారు. 

''ఒకే రాజధాని ఉండాలి, రాజధాని అభివృద్ధికి 30 వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇదే మాట బైబిల్ లాంటి మేనిఫెస్టోలో పొందుపరిచారా లేదా? చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించి అసెంబ్లీని రద్దు చేయండి. మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టే వైసీపీ భయపడుతోంది. విశాఖను ఆర్థిక రాజధానిగా చంద్రబాబు తీర్చిదిద్దారు'' అని అన్నారు. 

''రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అదానీ సెంటర్ ను ఎందుకు వెళ్లగొట్టారు? రాయలసీమ వాసులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖ రావాలా? 13 జిల్లాలను టీడీపీ అభివృద్ది చేయగా వైసీపీ మాత్రం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోంది. బిఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కంటే వైసీపీ నేతలు గొప్పవాళ్లా? రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభ ను దాటి నిర్ణయాలు తీసుకునే అధికారం వైసీపీకి ఎవరిచ్చారు? పరిధిలు దాటి, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి ఏం సాధిస్తారు? విశాఖ రాజధాని అనగానే అన్నీ అపశకునాలే. జగన్మోహన్ రెడ్డి ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఐదు కోట్ల ప్రజలను మోసం చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారు. అమరావతి విషయంలో జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రజా కోర్టులో తేల్చుకుందాం రండి. కరోనా కట్టడిలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. రాత్రి 9 గంటల వరకూ మద్యం దుకాణాలను అనుమతిలిస్తే కరోనా వ్యాప్తి చెందదా ? వెంటనే మద్యం దుకాణాలను మూసేయాలి'' అని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.