విజయనగరం: కట్టెకాలేవరకు తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కురుపాంలో పాదయాత్ర చేస్తున్న జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ బహిరంగ సభలో పుష్పశ్రీవాణి  కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను జీవితాంతం వైసీపీలోనే ఉంటానని, జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం గడ్డ వైఎస్సార్‌ కుటుంబానికి అడ్డా అని స్పష్టం చేశారు. వైఎస్ ఆర్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు అది నిజమన్నారు. 

అధికార పార్టీ తనను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించిందని అయినా తాను లొంగలేదన్నారు. నా చేతిపై వైఎస్ ఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్నానని చూపించారు. ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానన్నారు. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయని వాటిని అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే జగనన్న పరిష్కరిస్తారని తెలిపారు. 

కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్‌ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయని పుష్పశ్రీవాణి తెలిపారు. జగన్‌ సీఎం కావడం కోసం తాము దేనికైనా రెడీ అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురించి లొంగకుండా ఉన్న పుష్పశ్రీవాణి, ఆమె భర్త ప‌రీక్షిత్ రాజుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.