Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల హింస ... నిందితుల గుర్తింపు, పోలీసుల వైఫల్యం లేదు : పల్నాడు ఎస్పీ

శుక్రవారం మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసుల వైఫల్యం లేదన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ. గొడవకు కారణమైన నేతలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. 

palnadu district sp statement on macherla violence
Author
First Published Dec 17, 2022, 3:34 PM IST

శుక్రవారం పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిన్నటి హింసాత్మక ఘటనలో నిందితులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. సీసీ ఫుటేజ్, వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గొడవకు కారణమైన నేతలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. మాచర్ల అల్లర్లలో పోలీసుల వైఫల్యం లేదని.. కేవలం కొద్దిపాటి పరదాలు, కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. 

కాగా... మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

ALso REad:మాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు, లోకేష్ ల హస్తం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు  నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. 

వైసీపీ కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios