Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు, లోకేష్ ల హస్తం.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల అల్లర్ల వెనుక టీడీపీ ఉందని, చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తమ దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయన్నారు.

Chandrababu and Lokesh behind the Macherla riots, MLA Pinnelli Ramakrishna Reddy
Author
First Published Dec 17, 2022, 11:25 AM IST

గుంటూరు : పల్నాడు అల్లర్ల పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. గుంటూరు ఐబీలో మీడియాతో మాట్లాడారు. అల్లర్ల వెనుక చంద్రబాబునాయుడు, లోకేష్ ల హస్తం ఉందని మండిపడ్డారు. ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్ల కు పంపి దాడులు చేపిస్తున్నారన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయన్నారు. 

పల్నాడులో విధ్వంసానికి చంద్రబాబు,లోకేష్ లే బాధ్యత వహించాలని అన్నారు. గొడవలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులు కర్రలు,రాడ్ లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. 

ఆస్తుల విధ్వంసానికి టిడిపి నే కారణం అన్నారు. మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయన్నారు. ఘటనపై విచారణ చేసి కారకులపై అధికారులు  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు  నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. 

వైసీపీ కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు
మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణం అని, వైసీపీ గూండాలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు?  ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదన్నారు.

మాచర్ల లో వైసీపీ హింసపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితులు ఇంత దారుణం గా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని చంద్రబాబుప్రశ్నించారు.
తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై నా చర్యలు తీసుకోవాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios