కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్ష విషయంలో పాకిస్దాన్ కు తీవ్ర భంగపాటు ఎదురైంది. మన దేశానికి చెందిన కుల్ భూషణ్ కు పాకిస్ధాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. తమ దేశంలో గూఢచర్యం నిర్వహిస్తున్నారని పాకిస్ధాన్ అభియోగాలు మోపింది. అయితే, తన అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోయినా ఉరిశిక్ష మాత్రం ఖరారు చేసేసింది. దీనిపై దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి.

జాదవ్ కు ఉరిశిక్ష విధించటాన్ని మనదేశం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా పాకిస్ధాన్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక లాభం లేదనుకని వెంటనే భారత ప్రభుత్వం హేగ్ లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. మొదట్లో కేసును అంతర్జాతీయ న్యాయస్ధానం విచారించటాన్ని పాకిస్ధాన్ అంగీకరించలేదు. అనేక ఒత్తిళ్ల మేరకు అంగీకరిచింది. గడచిన మూడు రోజులుగా కేసును విచారించిన అంతర్జాతీయన్యాయస్ధానం జాదవ్ ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ బాగా వేగంగా స్పందించింది. దాని వల్లే పాకిస్ధాన్ కు భంగపాటు. కేసు విచారణ సందర్భంగా భారతదేశం వాదనలను పాకిస్ధాన్ ధీటుగా ఎదర్కోలేకపోయింది. ఒకవిధంగా అంతర్జాతీయ న్యాయస్ధానంలో వాదనలు జరగుతున్నపుడు పాకిస్ధాన్ తరపు న్యాయవాది ఉక్కిరిబిక్కిరైపోయారట. మనదేశం తరపున న్యాయశాస్త్రంలో దిట్టగా పేరున్న హరీష్ సాల్వే కేసును వాదించారు.

ఎప్పుడైతే హేగ్ లోని న్యాయస్ధానం జాదవ్ ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపేసిందో దేశవ్యాప్తంగా టపాకాయలు పేల్చి సంబరాలు  చేసుకున్నారు జనాలు. తమకు చెప్పకుండా, తమకు తెలీకుండా జాదవ్ ఉరిశిక్షను అమలు చేసేందుకు లేదని అంతర్జాతీయ న్యాయస్ధానం స్పష్టంగా ఆదేశించటం గమనార్హం.