పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) షాకింగ్ కామెంట్స్ చేసిందా? అవుననే అంటున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పిఏసి) ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. రెండు రోజుల్లో ఫైనాన్స్, మున్సిపల్ శాఖల పద్దులను రివ్యూ చేసింది. అదేవిధంగా కాగ్ ఇచ్చిన నివేదికలపై కూడా పిఏసి సమావేశం సమీక్షించింది.

పోలవరం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. అదే విషయాన్ని కాగ్ ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో కూడా స్పష్టంగా పేర్కొన్నది.  పోలవరం ప్రాజెక్టు పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణలకు కాగ్ ఇచ్చిన నివేదిక మద్దతుగా నిలుస్తున్నట్లైంది.

మున్సిపల్ శాఖతో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం హొసింగ్  పనులు, డోన్ నీటి సరఫరా పథకం, విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణంలో జరుగుతున్న జాప్యం తదితరాలపైన కూడా పిఏసి సమీక్షించింది.  పై నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తవుతాయనే విషయాన్ని కూడా అధికారులను అడిగి సమావేశం తెలుసుకున్నది. పిఏసి సమావేశాలకు ప్రభుత్వాధికారులు  వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కమిటి అభిప్రాయపడింది.

అధికారులు మొత్తం జన్మభూమి సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు కమిటి అభిప్రాయపడింది. కమిటి సమావేశాలకు అధికారులు కచ్చితంగా హాజరుకావాల్సి ఉన్నా హాజరుకావటం లేదు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ కూడా బ్యాలన్స్ తప్పినట్లు పిఏసి గమనించింది.  రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం అప్పు రూ. 96 వేల కోట్లుంటే ప్రస్తుతం రూ. 68వేల కోట్ల ను అదనంగా అప్పు చేసింది ప్రభుత్వం.  ఈ అప్పు అంతా రాష్ట్రంలో లని ప్రతి ఒక్కరి మీదా పడుతుందని కమిటి స్పష్టం చేసింది.