ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రోగులు ఆసుపత్రుల ముందు క్యూకడుతున్నారు. వీరిలో అత్యవసర పరిస్ధితి వున్న వారికి బెడ్లు దొరకడం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రోగులు ఆసుపత్రుల ముందు క్యూకడుతున్నారు. వీరిలో అత్యవసర పరిస్ధితి వున్న వారికి బెడ్లు దొరకడం లేదు. రాష్ట్రంలోనూ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశాలు వున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

విజయవాడ, గుంటూరు, విశాఖ, ఒంగోలులో పరిస్ధితులు దారుణంగా వున్నాయి. దీంతో ఆక్సిజన్ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాను అందుబాటులో ఉంచడం కత్తిమీద సాములా మారింది.

Also Read:ఏపీలో మరణ మృదంగం: ఒక్కరోజులో 69 మరణాలు.. 12 వేలు దాటిన కేసులు

జీజీహెచ్‌లో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో విశాఖ నుంచి హుటాహుటిన ఆక్సిజన్‌ను తరలించారు. ఈ క్రమంలో ఏలూరు నుంచి విజయవాడ మధ్యలో ఎక్కడా ట్రాఫిక్‌ ఆటంకాలు తలెత్తకుండా పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.

గుంటూరులోనూ పోలీసులు ఇదే తరహా ఏర్పాట్లు చేశారు. దీంతో నిర్ణీత గడువులోగా 10 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకర్ గుంటూరుకు రానుంది. ప్రస్తుతం జీజీహెచ్ లో 800 పైగా పడకలున్న నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగం అధికంగా ఉంటుంది. అందుకే డిజిటల్ మీటరింగ్ వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.