విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుల సమయస్పూర్తితో తమిళనాడుతో కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఎంతో కీలకమైన ఆక్సిజన్ వృదా కాకుండా అడ్డుకున్నారు పోలీసులు. సమయస్పూర్తితో వ్యవహరించిన పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి తమిళనాడు రాజధాని చెన్నైకి ఓ ఆక్సిజన్ ట్యాంకర్ బయలుదేరింది. అయితే రోడ్డుపై వెళుతుండగా వెనకవైపు నుండి ఆక్సిజన్ లీకేజీ ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని గుర్తించని ట్యాంకర్ డ్రైవర్ అలాగే పోనిచ్చాడు.

ఈ క్రమంలో గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద స్థానిక సీఐ శివాజీ విధులు నిర్వహిస్తుండగా సదరు లారీ అటువైపు వచ్చింది. దీంతో ట్యాంక్ నుండి ఆక్సిజన్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించిన ఆయన సమయస్పూర్తితో వ్యవహరించారు. సిబ్బందితో కలిసి తన వాహనంలో సదరు లారీని చేజ్ చేశారు. గూడవల్లి వద్ద లారీని అడ్డుకున్నారు. వెంటనే సాంకేతిక సిబ్బందిన పిలిపించి మరమ్మతు చేయించి ఆక్సిజన్ లీకేజీని అడ్డుకున్నారు. డ్రైవర్ కు తగిన సూచనలు ఇచ్చిన సీఐ లారీ గమ్యానికి చేరే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఇలా అప్రమత్తంగా వ్యవహరించిన గన్నవరం పోలీసులను ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎంతో విలువైన ప్రాణవాయువు వుధా కాకుండా అడ్డుకుని కరోనా రోగుల ప్రాణాలను కాపాడిన సీఐని అభినందిస్తున్నారు.