శశికళను ఎట్టి పరిస్ధితిలోనూ సిఎంగా ఒప్పుకునేది లేదన్న ధోరణిలో ఏపి మీడియా మరీ రెచ్చిపోతూండటమే ఆశ్చర్యంగా ఉంది.

తమిళ రాజకీయాలపై తెలుగు ఈ మధ్య మీడియా మరీ రెచ్చిపోతోంది. సిఎం పీఠం కోసం మొదలైన వార్ పై ఆరు రోజులుగా ప్రత్యేక వార్తలు ఇంకా సాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న జయలలిత మరణంతో అతి మొదలైంది. రోజుల తరబడి జయకు సంబంధించిన వార్తలను అందించాయి. ప్రింట్ మీడియా కూడా తామేమీ తక్కువ తినలేదన్న పద్దతిలో మొదటి పేజీలో ప్రముఖంగా రోజుల తరబడి ప్రచురించాయి వార్తలను. ఆ రోజుల్లో ఏపిలో ఇక సమస్యలే లేనట్లు మీడియా మొత్తం తమిళనాడు చుట్టూనే తిరిగింది.

సరే, జయలలిత తెలుగులో కూడా బాగా పాపులరే కాబట్టి జనాలు కూడా సరిపెట్టుకున్నారు. ఇంతలో మళ్లీ రెచ్చిపోతోంది. శశికళకు గానీ పన్నీర్ సెల్వంతో కానీ ఏపి మీడియాకు పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. అందులోనూ మీడియాలో మెజారిటీ పన్నీర్ కు మద్దతుగా నిలబడినట్లే కనబడుతోంది. శశికళను ఎట్టి పరిస్ధితిలోనూ సిఎంగా ఒప్పుకునేది లేదన్న ధోరణిలో ఏపి మీడియా మరీ రెచ్చిపోతూండటమే ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి తమిళనాడు రాజకీయాలు రోడ్డున పడటానికి గవర్నరే కారణం. శాసనసభాపక్ష నేతగా శశికళ పోయిన ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తికి సిఎంగా బాద్యతలు తీసుకోవటమన్నది లాంఛనమే. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న విద్యాసాగర్ రావుకు ఈ విషయం తెలీదా? పైగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా కూడా చేసారు. శశికళ సిఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఆ దశలో కేంద్రం నుండి వచ్చిన ఆదేశాల మేరకు గవర్నర్ శశికళకు అడ్డం తిరిగారు. సుప్రింకోర్టులో ఉన్న కేసులను చూపించి కొద్ది రోజులు ఆగమన్నారు. దాంతోనే శశికళను సిఎంగా కూర్చోబెట్టటం భారతీయ జనతా పార్టీకే ఇష్టం లేదన్న విషయం స్పష్టమైంది. అక్కడి నుండి తమిళ రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతోంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలను రోడ్డున పడేసిన ఘనత మాత్రం భాజపాకే దక్కుతుంది.

ఈ నేపధ్యంలో నిష్పక్షపాతంగా వార్తలు అందివ్వాల్సిన మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. రాజ్యాంగబద్దంగా అడ్డంకులేమీ లేకపోయినా శశికళను ఎందుకు సిఎంగా బాధ్యతలు నిర్వర్తించనీయటం లేదని గవర్నర్ ను మీడియా నిలదీయాలి. తెరవెనుక జరుగుతున్న కుట్ర కోణాన్ని ప్రజలముందుంచాలి. అటువంటిది మీడియా పన్నీర్కు అనుకూలంగా మొగ్గుచూపుతుండటం గమనార్హం. శశికళ విషయంలో జరగాల్సిందొకటైతే జరుగుతున్నదొకటి. కానీ మన మీడియా మాత్రం యధాప్రకారం జనాల కళ్ళకు గంతలు కట్టేస్తుండటం గమనార్హం.