సేంద్రియ సాగు చేయడానికే కాదు.. ఆ సాగు పద్ధతిలో పండించిన పంటనూ కొనుగోలు చేయడానికి వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రసాయనాలను దూరం పెట్టి.. పాలేకర్ చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ కొందరు రైతులు మందుకు నడుస్తున్నారు. వారు తమ పంటను నేరుగా వినియోగదారులకు అందించి మధ్య దళారుల ఉచ్చు నుంచి బయటపడుతున్నారు.
అమరావతి: ఇప్పుడు రైతుల్లో.. అలాగే వినియోగదారుల్లోనూ సేంద్రియ సాగుపై ఆసక్తి ఉన్నది. సేంద్రియ విధానంలో సాగు చేసిన పంటలను ఎక్కువ ధరలు వెచ్చించి కూడా కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. రైతులు కూడా దీర్ఘకాలికంగా భూ సారాన్ని నిలుపుకోవడానికి, పర్యావరణ హితంగా సేద్యం చేయడం, ప్రకృతిలో లభించే వనరులనే ఎరువులుగా వేయడం వంటివాటిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కాగా, రకరకాల రసాయన పదార్థాలతో సాగు చేసిన ఆహారాన్ని తినడం కంటే ప్రకృతి ఒడిలో రసాయన పదార్థాలు లేకుండా ప్రకృతిలో భాగంగానే సాగు చేస్తే ఆ పంటను సేకరించాలని, అలాంటి ఆహారాన్ని తినాలనే స్పృహ వినియోగదారుల్లోనూ కలుగుతున్నది. అందుకే దిగుబడి ఎంత అనే విషయాన్ని పక్కనబెట్టి, ఎంత ఆరోగ్యదాయక పోషకాలను సాగు చేస్తున్నామనేదే ముఖ్యం అవుతున్నది.
సాగులో రసాయనాలను తృణీకరించాలని, రసాయనాలకు బదులు సేంద్రియ ఎరువులు వినియోగించాలని పాలేకర్ ఆలోచనలకూ ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్నా.. అది కార్యరూపంలోకి రావాలంటే మరెంతో కృషి అవసరం ఉంటుంది. అయితే, చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం దండువారి పల్లెకు చెందిన జగదీశ్ రెడ్డి మాత్రం పాలేకర్ విధానాలపట్ల ఆకర్షితుడయ్యాడు. వ్యవసాయాన్ని పోషకాయుతంగానే చూశాడు. పర్యావరణ హితంతోపాటు ప్రజారోగ్యానికీ పెద్ద పీట వేసే తరుణంలో ఆయన పాలేకర్ విషయాలను తన 20 ఎకరాల భూమిలో అమల్లో పెట్టాడు.
2012లో తిరుపతిలో పాలేకర్ ఐదు రోజుల శిక్షణ తరగతులు పెడితే.. వాటికి జగదీశ్ రెడ్డి హాజరయ్యాడు. రసాయనాలతో సాగు చేయడం ఎంత నష్టదాయకమో.. ఆయన శాస్త్రీయంగా వివరించడం జగదీశ్ రెడ్డిని ఆకట్టుకుంది. ఆయన ఏడేళ్ల నుంచి ప్రకృతి సాగు పద్ధతుల్లోనే ఆయన సేద్యం చేస్తున్నారు.
పంట వేయడానికి ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తారు.. కలియదున్నుతారు. దేశీయ ఆవు, ఎడ్లు వాటి పేడ, మూత్రంతోపాటు ఇతర ఘనజీవామృతం, బీజామృతం వంటి ప్రకృతి మౌలిక వ్యవసాయ మౌలిక సూత్రాలను అమలు చేస్తున్నారు. నవార, ఇంద్రాణి వంటి దేశీయ రకాల ధాన్యం, ముడి బియ్యాన్ని మర పట్టించడం, వాటికి ఔషధ, సుగంధ ద్రవ్యాలను జోడించి బూస్టర్ పౌడర్లను తయారు చేసి అమ్ముతున్నారు. వీటిని హెల్త్ డ్రింక్స్ కోసం వినియోగిస్తున్నారు.
పంట పండిచండానికి రసాయనిక ఎరువులు, పురుగుల మందులను విచ్చలవిడిగా వినియోగించడం సరికాదని, అలా రసాయనాల మూలంగా సాగు భూమి జీవాన్ని కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
అదే విధంగా అంతా ప్రకృతి సేద్యం చేసినా.. దాని గురించి అవగాహన లేని వినియోగదారులకు దాన్ని అందించలేమని వివరించారు. కాబట్టి, అవగాహన కల్పించాలని కొందరు రైతులు చెబుతున్నారు. కాగా, ఈ విధానంలో పండించిన పంటను నేరుగా అమ్ముకోవడం ఉత్తమం అని జగదీశ్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమిని సజీవంగా భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని హెచ్చరించారు.
