రెండు రోజుల్లో జీపీఎస్ పెన్షన్ పై ఆర్డినెన్స్: ఏపీ ఎన్‌జీఓ మహాసభల్లో జగన్
జీపీఎస్ పెన్షన్ స్కీంపై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ రానుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
విజయవాడ: జీపీఎస్ పెన్షన్ స్కీం పై రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్ రానుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఏపీ ఎన్‌జీఓ మహాసభలు విజయవాడలోని మున్సిఫల్ స్టేడియంలో నిర్వహించారు.ఈ మహాసభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు నిజాయితీగా ముందుకు వెళ్లినట్టుగా సీఎం జగన్ చెప్పారు. దేశంతో పాటు విదేశాల్లో అమలు చేస్తున్న పెన్షన్ స్కీంలను అధ్యయనం చేసిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ పెన్షన్ ను అమలు చేయనున్నామన్నారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ పెన్షన్ స్కీం ను అమలు చేస్తామన్నారు. ఈ పెన్షన్ స్కీం ను ఇతర రాష్ట్రాల అధికారులు కూడ అధ్యయనం చేయనున్నారని సీఎం జగన్ ధీమాను వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలుపుకోవాలనే తపనతో పనిచేస్తున్న సర్కార్ తమదని జగన్ గుర్తు చేశారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధులని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేది ఉద్యోగులేనన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కూడా విలీనం చేసినట్టుగా చెప్పారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడ తాము మెరుగ్గానే ఉన్నామని సీఎం జగన్ చెప్పారు.2019 నుండి ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించినట్టుగా ఆయన తెలిపారు.
ఉద్యోగుల నియామకాల్లో నిబద్దతతో వ్యవహరించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం తమదేనన్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు కూడ వేతనాలు పెంచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ను అమలు చేస్తున్నామన్నారు 1998 డీఎస్‌సీ అభ్యర్థులకు కూడ న్యాయం చేశామని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చంద్రబాబు సర్కార్ ఎన్నికలకు ఆరు మాసాల ముందు వేతనాలను పెంచారన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చు పెరిగిందన్నారు. అయినా కూడ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదని జగన్ చెప్పారు.